అంగన్‌వాడీ కేంద్రం ఆధ్వర్యంలో సన్మానం
సర్పంచ్ ఈరగొల్ల అశోక్, ఉపసర్పంచ్ మేస్రం గణేష్ లకు అంబేద్కర్ చిత్రపటాల బహుకరణ
మన భారత్ | ఆదిలాబాద్:
ఆదిలాబాద్ జిల్లాలోని జామిడి గ్రామ అంగన్‌వాడీ కేంద్రం తరపున గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్‌లను ఘనంగా సన్మానించారు. అంగన్‌వాడీ టీచర్ లక్ష్మి ఆయమ్మ, పద్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ పాలనలో ప్రజాసేవకు అంకితమైన నాయకత్వాన్ని ప్రశంసిస్తూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలను సర్పంచ్ ఈరగొల్ల అశోక్, ఉపసర్పంచ్ మేస్రం గణేష్ లకు బహుకరించారు.
గ్రామ అభివృద్ధి, మహిళా–శిశు సంక్షేమ కార్యక్రమాలకు అంగన్‌వాడీ కేంద్రానికి అందిస్తున్న సహకారాన్ని గుర్తించి ఈ సన్మానం చేపట్టారు. అంగన్‌వాడీ కార్యకలాపాలు సమర్థవంతంగా అమలు కావడానికి గ్రామ పాలకవర్గం అందిస్తున్న సహకారం అభినందనీయమని అంగన్‌వాడీ టీచర్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్, ఉపసర్పంచ్‌లు మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అమలవుతున్న పోషణ, విద్యా, ఆరోగ్య కార్యక్రమాలు గ్రామాభివృద్ధికి మూలస్తంభమని తెలిపారు. అంగన్‌వాడీ సిబ్బంది చేస్తున్న సేవలు ప్రశంసనీయమని, భవిష్యత్తులోనూ పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో గ్రామ పెద్దలు, అంగన్‌వాడీ సిబ్బంది, మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామంలో సామాజిక సమరసత, అభివృద్ధి కోసం ఇలాంటి కార్యక్రమాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు.