manabharath.com
Newspaper Banner
Date of Publish : 04 January 2026, 2:14 pm Editor : manabharath

ఇక నుంచి వీరికి కూడా కరెంట్ ఫ్రీ..!

ఇక నుంచి వీరికి కూడా కరెంట్ ఫ్రీ… గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకోండి!

మన భారత్, తెలంగాణ| ప్రత్యేక కథనం:

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమల్లోకి తెచ్చిన గృహజ్యోతి పథకం‌పేద కుటుంబాలకు పెద్ద ఊరటనిస్తోంది. ఈ పథకం కింద నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. అయితే 200 యూనిట్లకు మించి కరెంట్ వినియోగిస్తే ఈ పథకం వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

గృహజ్యోతి పథకం లబ్ది పొందాలంటే బీపీఎల్ కుటుంబం అయి ఉండటం తప్పనిసరి. అందుకు రేషన్ కార్డు ముఖ్యమైన అర్హతగా నిర్ణయించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు కూడా కేటాయించింది. ఈ నేపథ్యంలో కొత్తగా రేషన్ కార్డు పొందిన వారు, ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు కూడా గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ పొందే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు నెలకు 200 యూనిట్లలోపు కరెంట్ వినియోగిస్తే గృహజ్యోతి పథకం పూర్తిగా వర్తిస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

దరఖాస్తు చేసుకోండి..

కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారు, ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు గృహజ్యోతి పథకానికి తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం తమ పరిధిలోని మున్సిపల్ కార్యాలయాలు, ఎంపీడీవో ఆఫీసుల్లో ఉన్న ప్రజాపాలన అధికారులకు దరఖాస్తులు సమర్పించాలి. అధికారులు అర్హతలను పరిశీలించిన అనంతరం లబ్దిదారుల జాబితాలో పేరు చేర్చుతారు.

దీంతో నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తే ఉచిత కరెంట్ లభించి పేద కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గనుంది.