manabharath.com
Newspaper Banner
Date of Publish : 03 January 2026, 4:26 pm Editor : Editor Vishal Kumar

బీఆర్ఎస్ నేతలకు సీఎం సవాల్.!

అసెంబ్లీలో తేల్చుకుందా రండి..

మన భారత్, తెలంగాణ: బీఆర్ఎస్ నేతలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభకు రాకుండా గులాబీ పార్టీ నేతలు తప్పించుకుతిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. బహిరంగ సభల్లో మాట్లాడటం కాదని.. సభకు రండి నిజాలు ఏంటో తేలుద్దామని సవాల్ విసిరారు. కృష్ణా నది జలాలపై చర్చ పెట్టమని తాము అడగలేదని ప్రస్తావించారు. బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ అడిగారని చెప్పుకొచ్చారు. అందుకే అసెంబ్లీ పెట్టి కృష్ణా నది జలాలపై చర్చిస్తున్నామని స్పష్టం చేశారు. ఇవాళ(శనివారం) అసెంబ్లీ మీడియా పాయింట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.

కేసీఆర్ సభకు ఎందుకు రాలేదో కారణమే లేదని అన్నారు. హరీశ్‌రావుకు మాట్లాడే అవకాశం స్పీకర్ ఇచ్చారని..అయినా తాము సభకు రామని వెళ్లిపోయారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలే అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని కోరారని..అయితే మీ బట్టలు ఊడదీస్తామని ఒకరు, తోలు తీస్తామని ఒకరు మాట్లాడారని.. ఇప్పుడేమో కుంటిసాకులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. సభకు వచ్చి చర్చలో పాల్గొంటే ఎవరి బట్టలు ఎవరు ఊడదీయాలో ప్రజలు తేల్చేవారని అన్నారు. ప్రాజెక్టుల పై నిలదీస్తామన్న కేసీఆర్ సభకు రాలేదని చెప్పుకొచ్చారు.

సభకు వచ్చి ఆయన దగ్గర ఉన్న సమాచారం ఇస్తారనుకున్నామని కానీ అసెంబ్లీకి ఎందుకు రావట్లేదో తెలియదని అన్నారు. కేసీఆర్ సూచనలు ఇస్తే తీసుకుందామని తాము అనుకున్నామని తెలిపారు. కృష్ణానీటిపై ఒకరోజు, గోదావరి నీటిపై మరోరోజు చర్చ పెడుదామనుకున్నామని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. రెండేళ్లుగా ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. సభకు వచ్చి కేసీఆర్ అనుభవాలు తమతో పంచుకోవాలని తాను పదేపదే ఆయనను కోరుతున్నానని పేర్కొన్నారు. గతంలో మాజీ మంత్రి జానారెడ్డి, భట్టి విక్రమార్క పోషించిన పాత్ర పోషించమని కోరారని తెలిపారు. జానారెడ్డి, భట్టిలను ఆనాడు అవమానినించినా భరించి సభకు వచ్చి సలహాలు ఇచ్చారని సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు..