manabharath.com
Newspaper Banner
Date of Publish : 03 January 2026, 1:42 pm Editor : Editor Vishal Kumar

ఇక కొత్త వాహనాలు కొంటే జేబుకు చిల్లు..!

తెలంగాణలో కొత్త వాహనాలపై రహదారి భద్రతా సెస్సు అమలు

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్త వాహనాల కొనుగోలుపై అదనపు భారం పడనుంది. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘రహదారి భద్రతా సెస్సు’ను ప్రవేశపెట్టింది. ఈ మేరకు మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లును రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.

నూతన నిబంధనల ప్రకారం ఇకపై రిజిస్ట్రేషన్ అయ్యే ప్రతి కొత్త ద్విచక్ర వాహనంపై రూ.2,000, కారుపై రూ.5,000, భారీ వాహనాలపై రూ.10,000 చొప్పున రహదారి భద్రతా సెస్సు వసూలు చేయనున్నారు. అయితే సామాన్యులకు ఊరటనిస్తూ ఆటోలు, ట్రాక్టర్లు, వ్యవసాయ అవసరాలకు వాడే వాహనాలకు ఈ సెస్సు నుంచి మినహాయింపు ఇచ్చారు.

 

అలాగే సరుకు రవాణా వాహనాలపై ఇప్పటివరకు అమలులో ఉన్న త్రైమాసిక పన్నును రద్దు చేసి, దాని స్థానంలో 7.5 శాతం లైఫ్ ట్యాక్స్ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే పాత వాహనాలపై వాహన వయసును బట్టి 4 శాతం నుంచి 6.5 శాతం వరకు పన్ను వసూలు చేయనున్నారు.

రోడ్డు భద్రతను మరింత మెరుగుపరచే దిశగా డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియను కఠినతరం చేయడంతో పాటు, కంప్యూటర్ ఆధారిత డ్రైవింగ్ పరీక్షలను అమలు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో ఏటా సుమారు 9 లక్షల కొత్త వాహనాలు రిజిస్టర్ అవుతున్న నేపథ్యంలో, ఈ కొత్త సెస్సు ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి సుమారు రూ.300 కోట్ల అదనపు ఆదాయం సమకూరనుందని అంచనా వేస్తున్నారు.