ఆదిలాబాద్ అభివృద్ధికి పార్లమెంట్లో గట్టి గళం
మన భారత్, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ నేత గోడం నగేష్ 2025 సంవత్సరానికి సంబంధించిన ఎంపీ ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదలైంది. పార్లమెంటులో 95 శాతం హాజరుతో జాతీయ స్థాయిలోనే మెరుగైన పనితీరును కనబరిచిన ఆయన, ప్రజా సమస్యలపై గట్టి స్వరం వినిపించారు.
ఈ ఏడాది పార్లమెంట్ సమావేశాల్లో గోడం నగేష్ మొత్తం 6 కీలక చర్చల్లో పాల్గొని, 97 ప్రశ్నలు అడిగి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం చురుకైన పాత్ర పోషించారు. ప్రజల సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో ఆయన చొరవ ప్రశంసనీయమని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
ముఖ్యంగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన జవహర్ నవోదయ విద్యాలయాల బలోపేతం, టైగర్ కారిడార్ అంశం, ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ నిర్మాణం అవసరం, తెలంగాణలోని గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్‌లో చేర్చడం వంటి అంశాలపై పార్లమెంట్లో విస్తృతంగా చర్చించారు. ఈ అంశాలు గిరిజన, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కీలకమని ఆయన స్పష్టం చేశారు.
అలాగే స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ అమలు, అమృత్ స్కీమ్ ద్వారా పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి, అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, మిల్లెట్ ప్రమోషన్ ద్వారా రైతులకు లాభాలు చేకూర్చే అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ ప్రశ్నల ద్వారా ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత, వేగం పెరగాలనే ఉద్దేశాన్ని వ్యక్తం చేశారు.
ప్రిన్సిండియా వేదికగా వెలువడిన ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రకారం, గోడం నగేష్ పనితీరు ఆదిలాబాద్ ప్రజలకు గర్వకారణంగా నిలుస్తుందని అభిమానులు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో కూడా జిల్లా అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తానని ఎంపీ గోడం నగేష్ స్పష్టం చేశారు.