manabharath.com
Newspaper Banner
Date of Publish : 27 December 2025, 11:35 am Editor : manabharath

సాయి స్వస్థ్య వెల్నెస్ సెంటర్ ప్రారంభం

సాయిలింగి వృద్ధాశ్రమంలో ఆరోగ్య సేవలకు నాంది

మన భారత్, ఆదిలాబాద్: తలమడుగు మండలంలోని సాయిలింగి వృద్ధాశ్రమంలో శ్రీ షిరిడి సాయి సేవా సొసైటీ, శ్రీ సత్యసాయి సుజాల స్రవంతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాయి స్వస్థ్య వెల్నెస్ సెంటర్ ను జిల్లా వైద్య శాఖ అధికారి డా. నరేంద్ర రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ డా. జై సింగ్ రాథోడ్ కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధులు, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో షిరిడి సాయి సేవా సొసైటీ, సత్యసాయి సుజాల స్రవంతి ట్రస్ట్ చేస్తున్న సేవలు మరువలేనివని కొనియాడారు. ఆరోగ్యం అందరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ వెల్నెస్ సెంటర్ వృద్ధాశ్రమంలో నివసించే వారికి, పరిసర గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

కార్యక్రమంలో సాయి వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు దెబ్బడి అశోక్, సర్పంచ్ ద్యావరి పొచ్చన్న, ఉపాధ్యక్షులు తోట శివన్న, ఉప సర్పంచ్ శ్రీనివాస్‌తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, సేవా కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వెల్నెస్ సెంటర్ ద్వారా నిరంతర వైద్య పరీక్షలు, ప్రాథమిక చికిత్సలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.