manabharath.com
Newspaper Banner
Date of Publish : 26 December 2025, 7:59 pm Editor : Editor Vishal Kumar

సకినాపూర్‌లో బీఆర్ఎస్ బలం పెంపు ..

సకినాపూర్‌లో బీఆర్ఎస్ బలం పెంపు – గ్రామస్తులను పార్టీలోకి ఆహ్వానించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని సకినాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ మద్దతు లభించింది. గ్రామమంతా ఏకతాటిపై నిలిచి ఇటీవల 200 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా, గ్రామస్తుల కోరిక మేరకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్  సకినాపూర్ గ్రామాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీపై, ముఖ్యంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారిపై ఉన్న నమ్మకంతోనే గ్రామంలో పెద్దఎత్తున పార్టీలో చేరామని తెలిపారు. “మేమంతా మీ వెంటే ఉన్నామన్న విషయం తెలియజేయడానికే మిమ్మల్ని గ్రామానికి ఆహ్వానించాం” అని వారు పేర్కొన్నారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, “గ్రామానికి ఏ అవసరమొచ్చినా మీ అన్నగా, తమ్ముడిగా, బిడ్డగా ఎల్లప్పుడూ అండగా ఉంటాను” అని హామీ ఇచ్చారు. తాను ప్రజలతో కలిసి జీవించే వ్యక్తినని, మీలో ఒకడిగా ఉంటానని స్పష్టం చేశారు. “మీ కోసం నా ఇంటి తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి” అంటూ ప్రజలకు భరోసా కల్పించారు.

గ్రామ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, యువతకు అవకాశాలు కల్పించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. సకినాపూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు, గ్రామస్తుల సహకారంతో పనిచేస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేస్త్రం నికిత నగేష్ , సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి, మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకు మద్దతు ప్రకటించారు. ఈ సంఘటనతో సకినాపూర్‌లో బీఆర్ఎస్ పార్టీ మరింత బలపడిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.