manabharath.com
Newspaper Banner
Date of Publish : 21 December 2025, 12:58 pm Editor : manabharath

కోడి గుడ్ల ధరలకు రెక్కలు..

కోడి గుడ్ల ధరలకు రెక్కలు… ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి చేరిన రేట్లు

మన భారత్, హైదరాబాద్: కోడి గుడ్డు ధరలు సామాన్యుడికి షాక్ ఇస్తున్నాయి. కొద్ది నెలల క్రితం బహిరంగ మార్కెట్‌లో రూ.5 నుంచి రూ.6 మధ్య పలికిన కోడి గుడ్డు ధరలు ఇప్పుడు ఏకంగా రూ.8కు చేరాయి. హోల్‌సేల్‌ మార్కెట్‌లోనే ఒక్కో గుడ్డు రూ.7.30కు విక్రయమవుతుండటం గమనార్హం. పౌల్ట్రీ రంగ చరిత్రలో ఇదే అత్యధిక ధరగా రైతులు, వ్యాపారులు పేర్కొంటున్నారు.

గతంలో 30 కోడి గుడ్లు రూ.160 నుంచి రూ.170 వరకు విక్రయించేవారు. అయితే గత పది రోజులుగా హోల్‌సేల్‌ మార్కెట్‌లోనే 30 గుడ్ల ధర రూ.210 నుంచి రూ.220 వరకు చేరింది. నాటు కోడి గుడ్లు అయితే ఒక్కోటి రూ.15 వరకు విక్రయమవుతున్నాయి. గుడ్డు ధరలు విని సామాన్యులు ‘అమ్మో’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

డిమాండ్‌కు తగిన ఉత్పత్తి లేకపోవడమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు చెబుతున్నారు. గతంలో తెలుగు రాష్ట్రాల్లో కలిపి రోజుకు సుమారు 8 కోట్ల గుడ్లు ఉత్పత్తి అయ్యేవి. అయితే కోడి గుడ్ల ఉత్పత్తికి అవసరమైన దాణా, మక్కలు, చేపపొట్టు వంటి ముడి సరుకుల ధరలు భారీగా పెరగడంతో అనేక మంది పౌల్ట్రీ రైతులు ఫారాల నిర్వహణను నిలిపివేశారు. దీని ప్రభావంతో గుడ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది.

ఒకప్పుడు ప్రతిరోజూ కనీసం 20 కోట్ల గుడ్లు కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ ఉండేవని, ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఉత్పత్తి తగ్గడంతో పాటు డిమాండ్ కొనసాగుతుండటంతో ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయని వివరించాయి.

ప్రస్తుతం హోల్‌సేల్‌లో రూ.7.30, రిటైల్‌లో రూ.8 ధర పలుకుతున్న కోడి గుడ్డు రేట్లు పౌల్ట్రీ చరిత్రలోనే ఆల్‌టైమ్‌ గరిష్ఠమని వ్యాపారులు చెబుతున్నారు. రానున్న రెండు నెలల పాటు ఇదే ధర కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. ధరలు మరింత పెరిగితే సామాన్యులపై అదనపు భారం పడే అవకాశం ఉందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.