manabharath.com
Newspaper Banner
Date of Publish : 21 December 2025, 7:36 am Editor : manabharath

జర్నలిస్టులు, విద్యార్థి సంఘాల నాయకులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి..

జర్నలిస్టులు, విద్యార్థి సంఘాల నాయకులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి: PYL

మన భారత్, నారాయణపేట: నారాయణపేట జిల్లా కేంద్రంలో విద్యార్థుల బస్సుల సౌకర్యం కోసం శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులపై, అలాగే ఆ ధర్నాను కవరేజ్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టులపై ఆర్టీసీ అధికారులు అక్రమంగా నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రగతిశీల యువజన సంఘం (PYL) జిల్లా అధ్యక్షులు **ప్రతాప్**, జిల్లా ప్రధాన కార్యదర్శి **సిద్దు** డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… విద్యార్థులు బస్సుల కోసం నిరీక్షిస్తూ PDSU, SFI, ABVP వంటి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శాంతియుతంగా ధర్నా చేపట్టారని తెలిపారు. కనీసం ఆర్టీసీ అధికారులు విద్యార్థుల వద్దకు వచ్చి వారి సమస్యలు వినాల్సిన బాధ్యత కూడా నిర్వర్తించకుండా, మాట్లాడే మర్యాద లేకుండా అక్రమ కేసులు నమోదు చేయడం సరైన పద్ధతి కాదని తీవ్రంగా విమర్శించారు.

ఇప్పటికే నారాయణపేట ఆర్టీసీ డిపో అధికారులపై విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం ఉందన్న ఆరోపణలు అనేకం ఉన్నాయని, వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ సమస్యలను పరిష్కరించకుండా ఉద్యమం చేసిన వారిపై కేసులు పెట్టడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.

అలాగే సమాజంలో జరుగుతున్న మంచి–చెడులను, విద్యార్థి సమస్యలను, ప్రభుత్వ విధానాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లే బాధ్యతతో పనిచేస్తున్న జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడం అంటే వారి హక్కులను కాలరాయడమేనని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని స్పష్టం చేశారు.

ఆర్టీసీ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని, విద్యార్థులకు బస్సు సౌకర్యాలు కల్పించకుండా ఉద్యమాన్ని అణచివేయడానికి, తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు జర్నలిస్టులపై కేసులు పెట్టారని ఆరోపించారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు తమ వైఖరిని మార్చుకుని విద్యార్థులకు తక్షణమే బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

వెంటనే విద్యార్థి సంఘాల నాయకులు, జర్నలిస్టులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఉపసంహరించుకోకపోతే, ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో వారికి మద్దతుగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని, అవసరమైతే ఆర్టీసీ డిపోను కూడా ముట్టడిస్తామని ప్రతాప్, సిద్దు హెచ్చరించారు.