manabharath.com
Newspaper Banner
Date of Publish : 21 December 2025, 7:09 am Editor : manabharath

పంచాయితీ ఎన్నికల్లో బీసీల విజయం..

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ఘన విజయం హర్షణీయం: కె. రామాంజనేయులు గౌడ్

మన భారత్, నారాయణపేట: తెలంగాణ రాష్ట్రంలో మూడు విడతలుగా నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి పైగా బీసీ వర్గాలకు చెందిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు గెలుపొందడం హర్షించదగ్గ విషయమని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కె. రామాంజనేయులు గౌడ్ అన్నారు.

నారాయణపేట జిల్లా కేంద్రంలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, రాజకీయ చైతన్యంతో పోటీ చేసి విజయం సాధించిన బీసీ బలహీన వర్గాల నూతన ప్రజాప్రతినిధులకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అలాగే జనరల్ స్థానాల్లో పోటీ చేసి పోరాట పటిమ చూపిన బీసీ సోదరులు, సోదరీమణులకు సామాజిక ఉద్యమ అభినందనలు తెలియజేశారు.

గత కొన్ని సంవత్సరాలుగా గ్రామీణ స్థాయిలో బీసీల రాజకీయ చైతన్యం, ఐక్యత కోసం బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర శాఖ కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లోని బీసీ కుల సంఘాలు, విద్యావేత్తలు, మేధావులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సంఘటితంగా ముందుకు నడిపించామని తెలిపారు. అదే సమయంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం అనేక ఉద్యమాలు చేపట్టామని గుర్తుచేశారు.

ఈ చైతన్య ఫలితంగానే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 శాతానికి పైగా గ్రామాల్లో బీసీలు సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులుగా ఎన్నికయ్యారని చెప్పారు. అగ్రకుల పార్టీలు—అధికార, ప్రతిపక్షాలుగా ఉన్నప్పటికీ—42 శాతం బీసీ రిజర్వేషన్లపై ఎన్నో కుట్రలు చేసినా, బీసీ అభ్యర్థుల విజయం ప్రజాశక్తిని చాటుతోందని వ్యాఖ్యానించారు.

ఈ ఎన్నికల ద్వారా ఒక విషయం స్పష్టమైందని, గ్రామాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో వచ్చిన రాజకీయ చైతన్యం, ఐక్యతను కొనసాగిస్తే రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో 60 శాతానికి పైగా స్థానాల్లో గెలిచి సత్తా చాటవచ్చని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు రాజకీయ చైతన్యంతో రాజ్యాధికార దిశగా అడుగులు వేయాల్సిన సమయం ఇదేనని కె. రామాంజనేయులు గౌడ్ పిలుపునిచ్చారు.