manabharath.com
Newspaper Banner
Date of Publish : 20 December 2025, 1:06 am Editor : manabharath

అడిషనల్ కలెక్టర్ల లంచాల దందా..! సీఎం సీరియస్

అడిషనల్ కలెక్టర్ల లంచాల దందా..! సీఎం సీరియస్

మన భారత్, తెలంగాణ: భూ భారతి సమస్యల పరిష్కారంలో జిల్లాల స్థాయిలో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించి జిల్లాల్లోని అడిషనల్ కలెక్టర్లు లంచాలు డిమాండ్ చేస్తున్నారంటూ సీఎంవోకు వరుస ఫిర్యాదులు అందుతున్నట్లు సమాచారం.

అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నప్పటికీ ఫైళ్లపై సంతకాలు చేయాలంటే లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అధికారులు నేరుగా డిమాండ్ చేస్తుండగా, మరికొందరు మధ్యవర్తుల ద్వారా డీల్ నడుపుతున్నారని ఫిర్యాదుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంతో భూభారతి దరఖాస్తులు నెలల తరబడి పెండింగ్‌లోనే ఉండిపోతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.

ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. రైతులను ఇబ్బందులకు గురిచేసే అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని సీఎం స్పష్టంగా హెచ్చరించినట్లు తెలిసింది. భూభారతి ఫైళ్ల పెండింగ్ పరిస్థితిపై సంబంధిత అడిషనల్ కలెక్టర్లు సంజాయిషీ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

అవినీతి ఆరోపణలపై పూర్తి స్థాయి నివేదిక కోరిన సీఎం, అవసరమైతే కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. భూభారతి సమస్యలను పారదర్శకంగా, వేగంగా పరిష్కరించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, రైతుల విశ్వాసాన్ని దెబ్బతీసే చర్యలను సహించబోమని స్పష్టం చేసినట్లు సమాచారం.