విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా? సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తీవ్ర ఖండన
మన భారత్, నారాయణపేట: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తే నాన్‌బెయిల్ కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ పార్టీ డివిజన్ కార్యదర్శి కె. కాశీనాథ్ తీవ్రంగా ఖండించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో డిసెంబర్ 17, 2025న సాయంత్రం 7 గంటలకు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో విద్యార్థి సంఘాలు రాస్తారోకో నిర్వహించాయి.
బస్టాండ్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన విద్యార్థులకు రాత్రి 8 గంటలైనా బస్సులు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. ఈ సమస్యలో బాలికలు కూడా ఉండటంతో విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తమైందన్నారు. పలుమార్లు కోరినా ఆర్టీసీ డిపో మేనేజర్ బస్సులు పంపకపోవడంతో విద్యార్థులు ఆకలితో అలమటించారని తెలిపారు.
విద్యార్థులకు అండగా నిలబడి బస్సులు నడపాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకులు సాయికుమార్, నరహరి, పవన్‌తో పాటు ఏబీవీపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారని వివరించారు. ఈ సందర్భంగా న్యూస్ కవరేజ్‌కు వచ్చిన సాక్షి రిపోర్టర్ రాజేష్, జర్నలిస్ట్ శంకర్‌లపై కూడా డిపో మేనేజర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నాన్‌బెయిల్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. కేసులో ఉన్న వారికి సమాచారం ఇవ్వకుండా అరెస్టు చేసి జైలుకు పంపడం స్వేచ్ఛను హరించడమేనని, ప్రశ్నించే గొంతుకులను బెదిరించే చర్యగా అభివర్ణించారు.
నారాయణపేట డిపో మేనేజర్ తరచూ విద్యార్థులకు బస్సులు నడపడంలో ఇబ్బందులు పెడుతున్నారని, అనేకసార్లు ఆందోళనలు చేస్తేనే బస్సు సౌకర్యం కల్పిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల సమస్యలను లేవనెత్తితే కేసులు పెట్టడం తగదని, ప్రజా పాలనలో ప్రశ్నించే వారిని జైలుకు పంపడం మంచి సంప్రదాయం కాదని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చే జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
- ఈ ఘటనను సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ, విద్యార్థి సంఘ నాయకులు మరియు జర్నలిస్టులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. విద్యార్థుల సమస్యలను పరిష్కరించి, వారి సమయానికి బస్సులు నడపాలని డిపో మేనేజర్‌ను కోరింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ ఘటనను తాత్కాలిక సంఘటనగా పరిగణించి, కక్షసాధింపు చర్యలకు పాల్పడవద్దని అధికారులకు విజ్ఞప్తి చేసింది.