ఐఈఎస్ విభాగంలో ఆలిండియా 82వ ర్యాంకు సాధించి తాంసి మండలానికి గర్వకారణం
మన భారత్, ఆదిలాబాద్: తాంసి మండలం పొన్నారి గ్రామానికి చెందిన యువకుడు నోముల సాయికిరణ్ యూపీఎస్సీ ఫలితాల్లో ప్రతిభ చాటి మండలానికే కాకుండా జిల్లాకే గర్వకారణంగా నిలిచాడు. బుధవారం సాయంత్రం వెలువడిన యూపీఎస్సీ ఫలితాల్లో ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ (IES) విభాగంలో ఆలిండియా 82వ ర్యాంకు సాధించి లక్ష్యాన్ని చేరుకున్నాడు.
ఈ ఏడాది జూన్ 8న నిర్వహించిన ప్రిలిమ్స్‌కు హాజరైన సాయికిరణ్, ఆగస్టు 10న మెయిన్స్, నవంబర్ 7న ఇంటర్వ్యూలో పాల్గొని ప్రతిభను నిరూపించాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన నోముల గంగన్న, అనసూయ దంపతుల కుమారుడైన సాయికిరణ్ చిన్నప్పటి నుంచే చదువులో చురుకుగా ఉండేవాడు. పదో తరగతి వరకు ఆదిలాబాద్‌లోని ప్రైవేటు పాఠశాలలో, ఇంటర్మీడియట్ (ఎంపీసీ) హైదరాబాద్‌లోని ప్రైవేటు కళాశాలలో, ఇంజినీరింగ్ విద్యను కరీంనగర్‌లోని ప్రైవేటు కళాశాలలో 2021లో పూర్తి చేశాడు.
సివిల్స్ సాధనే లక్ష్యంగా యూపీఎస్సీ పరీక్షలకు సాయికిరణ్ నిరంతరం సిద్ధమయ్యాడు. మొదటి ప్రయత్నంలో ప్రిలిమ్స్‌లో విఫలమైనా నిరాశ చెందకుండా పట్టుదలతో ముందుకు సాగాడు. రెండోసారి ఇంటర్వ్యూ వరకు చేరినా రిజర్వ్ స్థానానికే పరిమితమయ్యాడు. మూడో ప్రయత్నంలో మాత్రం ఐఈఎస్ విభాగంలో ఆలిండియా స్థాయిలో 82వ ర్యాంకు సాధించి తన కలను సాకారం చేసుకున్నాడు.
ఈ సందర్భంగా తల్లిదండ్రులు అనసూయ, గంగన్నలు ఆనందం వ్యక్తం చేస్తూ, తమ కుమారుడి విజయం తమ జీవితంలో మరువలేని ఘట్టమని పేర్కొన్నారు. సాయికిరణ్ విజయం తెలిసిన వెంటనే గ్రామస్థులు, స్నేహితులు అతడిని ఘనంగా అభినందించారు. పట్టుదల, క్రమశిక్షణ ఉంటే ఏ లక్ష్యమైనా సాధ్యమేనని సాయికిరణ్ విజయం యువతకు స్ఫూర్తిగా నిలుస్తోందని వారు తెలిపారు.