వారు మాతోనే ఉన్నారు… మావోయిస్టుల సంచలన ప్రకటన!
మన భారత్, స్టేట్ బ్యూరో: మావోయిస్టుల నుంచి మరోసారి సంచలన ప్రకటన వెలువడింది. మావోయిస్టు అగ్రనేత వికల్ప్ పేరిట శుక్రవారం విడుదల చేసిన లేఖలో, ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లు, కీలక నాయకుల గైర్హాజరీ, పోలీసుల ప్రచారం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాము ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని, తమ నేతలు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి ఇప్పటికీ తమతోనే ఉన్నారని స్పష్టం చేశారు.
హిడ్మా హత్యపై కొత్త ఆరోపణలు
వికల్ప్ లేఖలో హిడ్మా సమాచారం తమవారే పోలీసులకు ఇచ్చారు అన్న ప్రచారం అవాస్తవమని పేర్కొన్నారు. హిడ్మా మరణానికి నలుగురు వ్యక్తులే కారణమని ఆరోపించారు.
- హత్యకు ప్రధాన కారణం కోసాల్ అని పేర్కొన్నారు
- విజయవాడకు చెందిన కలప వ్యాపారి, ఫర్నిచర్ వ్యాపారి, ఒక కాంట్రాక్టర్ కలిసి ఈ కుట్రకు కారణమని ఆరోపణ
- అక్టోబర్ 27న చికిత్స పేరిట హిడ్మాను విజయవాడకు తీసుకెళ్లారని వెల్లడింపు
- అక్కడే పోలీసుల చేతిలో పట్టుబడి ఎన్‌కౌంటర్ అయినట్టు ఆరోపణ
హిడ్మా హత్యను దాచిపెట్టడానికి మారేడుమల్లి–రంపచోడవరం ప్రాంతాల్లో చేసిన ఎన్‌కౌంటర్ కథ పూర్తిగా డమ్మీ ఆపరేషన్ అని వికల్ప్ ధ్వజమెత్తారు.
“ఇది రాష్ట్ర ఆపరేషన్ కాదు… జాయింట్ ఆపరేషన్”
తాజా ఎన్‌కౌంటర్‌ను ఏపీ పోలీసులు చేసినదని ప్రచారం జరుగుతోందని, కానీ ఇది కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆపరేషన్ అని వికల్ప్ ఆరోపించారు.
హిడ్మా ఆలోచనలు, ఆశయాలు కొనసాగుతాయని, తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.
ఆపరేషన్ ‘కగార్’ నేపథ్యం
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ కారణంగా మావోయిస్టుల కదలికలపై భద్రతా బలగాల కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగుతోంది.
ఇటీవల మారేడుమల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మాతో పాటు పలువురు కీలక నేతలు హతమైన నేపథ్యంలో, మావోయిస్టు పార్టీ వరుస ఆరోపణలు చేస్తోంది.
ఈ లేఖ విడుదలతో హిడ్మా హత్యపై మరోసారి వివాదం చెలరేగింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య సాగుతున్న ఆపరేషన్ల నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.