manabharath.com
Newspaper Banner
Date of Publish : 02 December 2025, 4:29 pm Editor : manabharath

పవన్ కల్యాణ్‌కు రాజకీయాలు తెలియవు –

పవన్ కల్యాణ్‌కు రాజకీయాలు తెలియవు.. బేషరతు క్షమాపణలు చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి డిమాండ్

మన భారత్, హైదరాబాద్, డిసెంబర్ 02:ఆం ధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తెలంగాణకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటైన పదజాలంతో విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్‌కు రాజకీయాలపై అవగాహన లేదని, తెలిసి తెలియకుండా మాట్లాడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. కోనసీమ పర్యటన సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను బాధించాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

పవన్ వ్యాఖ్యలు బాధాకరం… క్షమాపణ చెబితేనే సరిపడుతుంది’

పవన్ కల్యాణ్ ఇటీవల కోనసీమలో మాట్లాడుతూ *“తెలంగాణ నాయకుల దిష్టి కారణంగా కొబ్బరి తోటలు ఎండిపోయాయి”* అని చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై ప్రతిస్పందించిన మంత్రి కోమటిరెడ్డి—పవన్ కల్యాణ్ బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

అంతేకాకుండా,

“పవన్ క్షమాపణలు చెబితే ఆయన సినిమాలు తెలంగాణలో ఒకటి, రెండు రోజులు ఆడతాయి. లేకపోతే ఆ సినిమాలకు చోటుండదు” అని వ్యాఖ్యానించారు. పవన్ సోదరుడు చిరంజీవి సూపర్‌స్టార్ అయినా, రాజకీయాలతో ఆయ‌నకు సంబంధం లేదని గుర్తు చేశారు.

ఉమ్మడి ఆంధ్రలో తెలంగాణ తీవ్ర నష్టం చవిచూసింది’

ఈ సందర్భంగా కోమటిరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఎదుర్కొన్న నష్టాలను గుర్తు చేశారు.

హైదరాబాద్ సంపాదన విశాఖ, కాకినాడ, తిరుపతి అభివృద్ధికి వినియోగించబడిందని, తెలంగాణకు న్యాయం జరగలేదని తెలిపారు.

ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పాలనలో తెలంగాణ వెనుకబడి పోయిందని ఆరోపించారు.

‘తెలంగాణపై ఇలా మాట్లాడితే ఊరుకోం’

టాలీవుడ్ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల భావోద్వేగాలను దెబ్బతీశాయని మంత్రి పేర్కొన్నారు.

ఇలాంటి వ్యాఖ్యలు భవిష్యత్తులో పునరావృతం కాకూడదని హెచ్చరించారు.

 

వివాదం నేపథ్యంలో ఏం జరిగింది?

కోనసీమ పర్యటనలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలో “తెలంగాణ నాయకుల దిష్టి వల్ల కొబ్బరి తోటలు ఎండిపోయాయి” అనే మాటలు చర్చనీయాంశమయ్యాయి.

ఈ వ్యాఖ్యలపై తెలంగాణ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పవన్‌ని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.