అయ్యప్ప దీక్ష పేరుతో పోలీసు వ్యవస్థపై దాడి… మతాన్ని రాజకీయాలకు ఆయుధం చేసేదారిలో ఎవరు?
మన భారత్ ,హైదరాబాద్: డ్యూటీలో ఉన్న ఓ ఎస్సై అయ్యప్ప దీక్షలో ఉండటంతో, ఖాకీ యూనిఫాంలో విధులకు హాజరు కావడం సాధ్యంకాదని పై అధికారులు సూచించిన విషయం పెద్ద వివాదంగా మారింది. అంతర్గతంగా ఇచ్చిన సూచన బయటకు రావడంతో కొందరు రాజకీయ నేతలు ఆ అంశాన్ని పెంచిపెట్టి, హిందూ భక్తులపై అవమానం జరిగిందని ఆరోపణలు చేస్తూ పోలీసు వ్యవస్థపైనే దండెత్తారు. ఏకంగా డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేంత వరకు ఉద్రిక్తత పెరగడం ఆశ్చర్యకరంగా మారింది.
పోలీసులకి పక్కా రూల్స్… అవి పాటించాల్సిందే
పోలీసు విభాగం స్వతంత్రంగా నిబంధనల ఆధారంగా నడిచే సంస్థ.
యూనిఫాం సర్వీస్ కాబట్టి, ఖాకీ లేకుండా విధుల్లో పాల్గొనడం స్పష్టంగా నిబంధనలకు విరుద్ధం.
అయ్యప్ప మాల వేసుకోవడం వ్యక్తిగత విశ్వాసం. దానిపై ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు.
కానీ యూనిఫాం లేకుండా డ్యూటీ చేయాలనుకోవడం సాధ్యం కాదనే కారణంతో పైస్థాయి అధికారులు సెలవు తీసుకోవాలని సలహా మాత్రమే ఇచ్చారు. ఇది సాధారణ పరిపాలనా చర్య. అయితే దీనిని వక్రీకరించి, మతానికి వ్యతిరేక చర్యగా చూపేందుకు ప్రయత్నాలు జరగడం పరిస్థితులను మరింత ఉద్రిక్తం చేశాయి.
పోలీసులు ప్రభుత్వం కాదు… పాలనలో భాగం మాత్రమే
కొంతమంది ఈ ఘటనను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటూ, ప్రభుత్వంపై హిందూ వ్యతిరేక ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతి ఏడాది అయ్యప్ప సీజన్‌లో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, పోలీసు వ్యవస్థలో ఇలాంటి సూచనలు వస్తుంటాయి. కానీ ఈసారి వివాదం కావాలనే రగిలించబడిందని భావిస్తున్నారు.
భక్తితో చేసే దీక్షను రాజకీయ రంగులోకి తేవడం సరైంది కాదని పెద్దఎత్తున అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.
అయ్యప్ప భక్తులు కూడా ఆలోచించాలి… రాజకీయాలకు దూరంగా ఉండాలి
తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప దీక్షలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. పడిపూజలు, మండల దీక్షలు మరింతగా పెరుగుతున్నాయి. కానీ కొంతమంది నాయకులు భక్తుల భావోద్వేగాలను వాడుకోవడానికి ప్రయత్నించడం వల్లే ఇటువంటి ఉద్రిక్తతలు వస్తున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భక్తి అనేది రాజకీయాలకు అతీతం. తపస్సు, శాంతి, నిష్ట—ఇవే అయ్యప్ప దీక్ష సారాంశం. కానీ రాజకీయాలు కలిస్తే భక్తి కన్నా అజెండాలు పెద్దవిగా మారతాయి.
ఈ ఘటన మరోసారి మతాన్ని రాజకీయాలకు ముడిపెట్టడంపై చర్చను తెరపైకి తెచ్చింది.