manabharath.com
Newspaper Banner
Date of Publish : 30 November 2025, 2:33 am Editor : manabharath

నకిలీ అనిశా అధికారి అరెస్ట్..

నకిలీ అనిశా అధికారి ఉచ్చు… ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని లక్షల్లో దండుకున్న మోసగాడు అరెస్టు

మన భారత్ , హైదరాబాద్: నిజమైన అనిశా అధికారుల పేరును దుర్వినియోగం చేస్తూ పలువురు ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసిన నకిలీ అనిశా అధికారి చివరకు పోలీసుల వలలో చిక్కాడు. అవినీతి కేసుల్లో అనిశా అధికారుల దాడులు జరిగితే వెంటనే రంగంలోకి దిగుతూ, సంబంధిత ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు, డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
అనిశా పేరుతో బెదిరింపులు
గత నెలలో ఆర్టీఏ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక ఎంవీఐకి ఈ నకిలీ అధికారి ఫోన్ చేసి, “అనిశా నుంచి మాట్లాడుతున్నాను, మీపై ఫిర్యాదులు ఉన్నాయి” అంటూ బెదిరించాడు. అతని మాటలకు భయపడి ఉద్యోగి అడిగినంత మొత్తాన్ని ఆ వ్యక్తి పేర్కొన్న ఖాతాల్లోకి జమ చేశాడు.
పోలీసుల కేసు నమోదు – విచారణ వేగం
ఈ ఘటనపై బాధితుడు ఫిర్యాదు చేయడంతో మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో, గత కొన్నేళ్లుగా ఉమ్మడి జిల్లాలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులను ఇదే రీతిలో భయపెట్టి లక్షల్లో డబ్బులు దండుకున్నట్లు బయటపడింది.
మోసగాడికి ఎండ్ కార్డు
సాంకేతిక ఆధారాలతో నకిలీ అధికారిని గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి మోసానికి ఉపయోగించిన ఫోన్లు, బ్యాంక్ ఖాతాల వివరాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. మరికొన్ని ఫిర్యాదులు వెలుగులోకి వచ్చే అవకాశమున్నాయని పోలీసులు తెలిపారు.