manabharath.com
Newspaper Banner
Date of Publish : 28 November 2025, 9:37 pm Editor : manabharath

పిల్లల ఆరోగ్యానికి ఏ పాలు మంచివి.?

నిపుణుల ముఖ్య సూచనలు తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాలి
మన భారత్ – హెల్త్ డెస్క్ హైదరాబాద్: చిన్నారుల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు ఎక్కువగా అయోమయంలో పడే ప్రశ్నల్లో ప్రధానంగా ఉండేది—పిల్లలకు ఏ పాలు మంచివి? నూతన శిశువుల నుంచి రెండు సంవత్సరాల వయస్సు వరకు పాలు ఎంపికలో జాగ్రత్త అవసరమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

సంవత్సరం లోపు పిల్లలకు ఆవు పాలు ఎందుకు వద్దంటే?
పుట్టిన శిశువులకు 12 నెలల లోపు ఆవు పాలు ఇవ్వకూడదని బాలరోగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆవు పాలలోని ఐరన్ శాతం చాలా తక్కువగా ఉండటంతో పాటు, అందులో ఉన్న కొన్ని ప్రోటీన్లు శిశువుల ప్రేగులపై ప్రభావం చూపి అంతర్గత రక్తస్రావానికి దారితీయవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇది ఐరన్ లోపంతోపాటు రక్తహీనతకు కారణం కావచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

గేదె పాలు ఎందుకు ఆలస్యంగా ఇవ్వాలి?
గేదె పాలలో ప్రోటీన్లు, ఖనిజాలు అధికంగా ఉండటం వల్ల చిన్నారుల కిడ్నీలపై అదనపు ఒత్తిడి పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే రెండేళ్ల వయస్సు వచ్చే వరకు గేదె పాలు ఇవ్వకుండా ఉండాలని సూచిస్తున్నారు.

ఏం చేయాలి?
పుట్టిన పిల్లల కోసం తల్లిపాలు ఉత్తమమైన ఆహారం. ఒక సంవత్సరానికి పైగా వచ్చిన తర్వాత మాత్రమే ఆవు పాలను ఆహారంలో చేర్చాలని, గేదె పాలను రెండో ఏట తర్వాత ప్రారంభించాలన్నారు. ప్రతి చిన్నారి ఆరోగ్య పరిస్థితి భిన్నంగా ఉండే కారణంగా, పాలు ప్రారంభించే ముందుగా పిల్లల వైద్యుడి సలహా తీసుకోవడం అత్యంత అవసరం.

కుటుంబాలు ఈ సూచనలను పాటిస్తే, చిన్నారుల ఆరోగ్యం మరింత బలపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు.