అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్— రాజధానికి మౌలిక వసతుల విస్తరణలో కీలక ముందడుగు
మన భారత్ – ఆంధ్రప్రదేశ్ డెస్క్ అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రైల్వే స్టేషన్, కొత్త రైల్వే లైన్, స్పోర్ట్స్ సిటీ మరియు ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం అదనంగా 16 వేల ఎకరాలను సమీకరిస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ వెల్లడించారు. అమరావతిలో వేగవంతమైన అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల విస్తరణలో ఇది పెద్ద మైలురాయిగా ఆయన పేర్కొన్నారు.
రాజధాని అభివృద్ధికి అంతర్జాతీయ విమానాశ్రయం అత్యవసరమని, అందుకే అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మించేందుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని మంత్రి తెలిపారు. రాజధాని ప్రణాళికలో విమానాశ్రయం కీలక పాత్ర పోషించనుందన్నారు.
గత ప్రభుత్వంలో కేవలం 70 ఎకరాలు మాత్రమే కేటాయించిన స్పోర్ట్స్ సిటీకి, ప్రస్తుత ప్రభుత్వం భారీగా 2,500 ఎకరాలు కేటాయించిందని నారాయణ వివరించారు. అమరావతిని క్రీడల కేంద్రంగా, పెట్టుబడుల గమ్యంగా మారుస్తూ అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.
అమరావతి మౌలిక వసతుల విస్తరణ, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం పూర్తి కాగానే రాష్ట్రానికి ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో భారీ ప్రయోజనాలు కలగనున్నాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.