సర్పంచ్ ఎన్నికల్లో వేగం… ఈసీ నుంచి టీ–పోల్ మొబైల్ యాప్ లాంచ్
మన భారత్, హైదరాబాద్: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి గట్టిగానే మొదలైంది. తొలి దశ నామినేషన్లతో ఎన్నికల ప్రక్రియ పురోగమిస్తుండగా, ఎన్నికల నిర్వహణను మరింత పారదర్శకంగా, సులభంగా చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్లకు సమాచారం అందుబాటులో ఉండేలా టీ–పోల్ మొబైల్ యాప్ (T-Poll Mobile App) ను అధికారికంగా విడుదల చేసింది.
ఈ యాప్ ద్వారా ఓటర్లు తమ వోటర్ స్లిప్, పోలింగ్ స్టేషన్ వివరాలు సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏవైనా సమస్యలు ఎదురైతే, యాప్‌లోనే నేరుగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు నమోదు చేసే అవకాశం కూడా ఇవ్వడం ప్రత్యేకత. నమోదు చేసిన ఫిర్యాదుల స్టేటస్‌ను కూడా చెక్ చేసుకునే సౌకర్యం ఇందులో ఉంటుంది.
ఈసీ ప్రకటన ప్రకారం టీ–పోల్ మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో ఇప్పటికే డౌన్లోడ్‌కు అందుబాటులో ఉంది. ఎన్నికల ప్రక్రియలో ఓటర్లకు అవసరమైన అన్ని సమాచారాన్ని ఒకేచోట అందించడమే ఈ యాప్ లక్ష్యంగా పేర్కొంది.
ఇదిలాఉండగా, తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు దశల్లో జరగనున్నాయి. ఎన్నికల తేదీలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ యాప్ ఓటర్లకు మరింత సహాయపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.