manabharath.com
Newspaper Banner
Date of Publish : 27 November 2025, 10:42 am Editor : manabharath

నామినేషన్ దాఖలు సజావుగా జరిగేలా చూడాలి

నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించిన అధికార యంత్రాంగం

మన భారత్, తెలంగాణ: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల స్వీకరణ మొదలయ్యాక మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్వయంగా పరిశీలనకు దిగి, వివిధ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను గురువారం ఆకస్మికంగా సందర్శించారు. నోటిఫికేషన్ విడుదలైన తొలి రోజునే నామినేషన్ కేంద్రాల్లో అన్ని సదుపాయాలపై ఆయన పరిశీలన చేపట్టడం ఎన్నికల నిర్వహణపై జిల్లా యంత్రాంగం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధను సూచిస్తుంది.

రేగోడు, శంకరంపేట ఆర్, అల్లాదుర్గ్, టేక్మాల్ ఎంపీడీవో కార్యాలయాల్లో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, కలెక్టర్ అక్కడి హెల్ప్ డెస్క్‌లు, వీడియోగ్రఫీ ఏర్పాట్లు, పోలీస్ బందోబస్తు, నోటీసు బోర్డులపై నోటిఫికేషన్ ప్రదర్శన వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు. సపోర్టింగ్ స్టాఫ్ అందుబాటులో ఉన్నారో లేదో కూడాను ఆయన ప్రత్యేకంగా విచారించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ, “నామినేషన్ దరఖాస్తుల స్వీకరణలో పొరపాట్లు జరగకూడదు. తీసుకున్న ప్రతి నామినేషన్ ఫారమ్ వివరాలు రిజిస్టర్‌లో తప్పకుండా నమోదు చేయాలి” అని రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దాఖలైన అఫిడవిట్‌లను రోజువారీగా నోటీసు బోర్డులపై ప్రదర్శిస్తూ, జిల్లా కేంద్రానికి సమయానికి నివేదికలు పంపాలని సూచించారు.

ప్రతి నామినేషన్ సెంటర్‌లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించిన ఆయన, అభ్యర్థులకు అవసరమైన సహాయం తక్షణం అందించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ జరగాలని, ప్రవర్తనా నియమావళి అమలుపై రాజీ లేకుండా ఉండాలని సూచించారు.

కలెక్టర్ వెంట స్థానిక అధికారులు పాల్గొనగా, సంబంధిత విభాగాల సిబ్బంది కూడా పరిశీలనలో పాల్గొన్నారు.