బీసీలను ఘోరంగా మోసం చేసిన కాంగ్రెస్… 42% అని చెప్పి 17%కే పరిమితం
మన భారత్, తెలంగాణ:
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీపై వివాదం రగులుతోంది. ఎన్నికల ముందు బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని ఘనంగా ప్రకటించిన కాంగ్రెస్… అధికారంలోకి వచ్చిన తరువాత ఆ వాగ్దానాన్ని నిలబెట్టకపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజా ఆదేశాల ప్రకారం కేవలం 17 శాతం రిజర్వేషన్లను మాత్రమే అమలు చేయడంతో బీసీ వర్గాల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది.
బీసీల రాజకీయ ప్రతినిధిత్వం పెరగాలనే ఉద్దేశంతో 42 శాతం రిజర్వేషన్ వాగ్దానం చేయగా, ఇప్పుడు కేవలం 17 శాతం కేటాయించడం మోసపూరిత చర్యగా బీసీ సంఘాలు సూటిగా వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రభుత్వంపై నమ్మకం ఉంచి ఎదురుచూసిన బీసీ నేతలు, సంఘాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి.
రాజకీయ ప్రయోజనాల కోసం భారీ హామీ ఇచ్చి, అమలులోకి రాగానే చేతులెత్తేసినట్టుగా కనిపిస్తున్న కాంగ్రెస్ నిర్ణయంపై ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్నాయి. బీసీలతో చేసిన మోసం వెనక్కి తీసుకుని, 42 శాతం రిజర్వేషన్ హామీని వెంటనే అమలు చేయాలని వీరు డిమాండ్ చేస్తున్నారు.
ఈ పరిణామాలతో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా తెలంగాణ రాజకీయాల్లో రిజర్వేషన్ల అంశం మరింత వేడెక్కింది.