రేషన్ కార్డు ఉంటే మీ ఇంటికే చీర: 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు అందజేస్తామని మంత్రి పొన్నం హామీ
మన భారత్, సిద్దిపేట: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమంపై దృష్టి సారిస్తూ, ఎన్నికల హామీలను వేగంగా అమలు చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. తెల్ల రేషన్ కార్డు కలిగి, 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు చీరను ఇంటికే తీసుకెళ్లి అందజేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
సిద్దిపేట జిల్లా కోహెడలో జరిగిన చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం, మహిళల ఆర్థిక స్వావలంబనపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. “మహిళలను కోటీశ్వరులను చేయడం మా ప్రభుత్వం యొక్క మహోన్నత లక్ష్యం,” అని పేర్కొన్నారు.
ఇంటికే వచ్చి బొట్టు పెట్టి చీర అందజేత
తెల్ల రేషన్ కార్డు ఉన్న 18 ఏళ్ల పైబడిన మహిళలకు మహిళా సంఘాల సభ్యులే ఇంటికొచ్చి బొట్టు పెట్టి చీర అందజేస్తారు అని మంత్రి తెలిపారు. ఆడబిడ్డలకు ఏ కష్టం రానివ్వమని హామీ ఇచ్చారు.
మహిళా సంఘాలకు భారీ ప్రోత్సాహం
మహిళా సంఘాలకు 10 ఏళ్ల పాటు వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని మంత్రి ప్రకటించారు.
మహిళా సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం సహకరిస్తోంది.
ఈ చీరల పంపిణీ పథకం ప్రభుత్వ గౌరవం, ప్రేమ, ‘సారే’ (బహుమతి)గా అన్నారు.
పంపిణీలో క్షేత్ర స్థాయిలో గందరగోళ
ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, కొన్ని గ్రామాల్లో చీరల పంపిణీ సమయంలో ఇబ్బందులు తలెత్తాయి.
కొన్ని చోట్ల మహిళా సంఘ సభ్యులకే ప్రాధాన్యం ఇవ్వటం వల్ల,
రేషన్ కార్డు ఉన్నప్పటికీ సంఘంలో సభ్యులుకాని మహిళలకు చీరలు అందకపోవడం తర్వాత వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు ప్రతి అర్హుడికీ పంపిణీ జరగాలి అని చెప్పినా, పంపిణీ విధానంలో లోపాలు చోటుచేసుకోవడంతో అర్హులకు అన్యాయం జరుగుతోందని మహిళలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం లక్ష్యాన్ని సాధించాలంటే పారదర్శకంగా, సమర్థవంతంగా పంపిణీ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని మహిళలు కోరుతున్నారు.