పుచ్చ లేచిపోద్ది: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి కవిత ఘాటైన వార్నింగ్
మన భారత్, వనపర్తి: తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తనపై వ్యక్తిగత విమర్శలు చేసిన నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. “పుచ్చువంకాయ, సచ్చు వంకాయ” అంటూ తనను అవమానించే వ్యాఖ్యలు చేస్తే ఇకపై “పుచ్చ లేచిపోతుంది” అంటూ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు.
తండ్రి వయసు వారికి గౌరవం ఇస్తూ ఇంతకాలం మౌనం పాటించానని, ఇకపై సహించబోనని కవిత స్పష్టం చేశారు.
అవినీతిపై సంచలన ఆరోపణలు
‘జాగృతి జనం బాట’లో భాగంగా వనపర్తిలో మీడియాతో మాట్లాడిన కవిత, నిరంజన్ రెడ్డి అవినీతిపై భారీ ఆరోపణలు చేశారు.
- ఒక్కసారి మంత్రి అయిన నిరంజన్ రెడ్డి మూడు ఫామ్‌హౌస్‌లు ఎలా కట్టుకున్నారో ప్రశ్నించారు.
- వాటిలో అసైన్డ్ భూములు కూడా ఉన్నాయని ఆరోపించారు.
- కృష్ణా నది కాలువను ఆయన ఫామ్‌హౌస్ పక్కనే వెళ్లేలా మళ్లించారనే స్థానికుల ఆరోపణలను ప్రస్తావించారు.
కేసీఆర్‌కి తెలియదా? హరీశ్ పాత్ర ఏంటి?
ఈ వ్యవహారాలన్నీ మాజీ సీఎం కేసీఆర్‌కి తెలియవా?
లేక హరీశ్ రావు అడ్డుపడి కేసీఆర్ దృష్టికి వెళ్లకుండా కాపాడారా? అని కవిత ప్రశ్నించారు.
నిరంజన్ అవినీతిపై ఇక్కడి చిన్న పిల్లవాడు కూడా చెప్పగలడని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని బహిరంగంగా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తున్నానని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ప్రశ్నలు
ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరంజన్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోవడంపై కూడా కవిత అసంతృప్తి వ్యక్తం చేశారు.
హరీశ్‌కు అతను సన్నిహితుడైనందువల్లే ప్రభుత్వం అతనిని కాపాడుతోందని నమ్మకం అని చెప్పారు.
బీఆర్‌ఎస్‌తో సంబంధం లేదన్న కవిత
తనకు ఇకపై బీఆర్‌ఎస్‌తో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిన కవిత, ఆ పార్టీలో ఉద్యమకారులు సతమతమవుతున్నారని వ్యాఖ్యానించారు.