manabharath.com
Newspaper Banner
Date of Publish : 24 November 2025, 8:36 pm Editor : manabharath

మీ సేవ సర్వీసెస్ ఆన్ వాట్సాప్..

వాట్సాప్‌లోనే కులం, ఆదాయం, జనన ధ్రువపత్రాలు… ఇప్పుడు ఒక్క మెసేజ్‌ చాలు!

మన భారత్, హైదరాబాద్: ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం పెద్ద అడుగు వేసింది. ఇకపై కులం, ఆదాయం, నివాసం, జనన, మరణ ధ్రువపత్రాలు సహా అనేక ముఖ్యమైన పత్రాలు పొందడానికి మీసేవ కేంద్రాలు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పోతుంది.

మీ సేవ సర్వీసెస్ ఆన్ వాట్సాప్’ అనే కొత్త వేదిక ద్వారా ఇంట్లో కూర్చుని ఒక్క మెసేజ్‌తోనే ఈ ధ్రువీకరణ పత్రాలను పొందే అవకాశం కల్పించారు. అధికారిక వాట్సాప్ నంబర్ 80969 58096కు మెసేజ్ పంపితే సరిపోతుంది.

ప్రస్తుతం 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన 580కిపైగా సేవలు ఈ వేదిక ద్వారా అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్‌ఫోన్ వాడకం పెరిగిన నేపథ్యంలో ఈ సేవ మరింత ప్రయోజనకరంగా ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.

పౌరులు ఇకపై వాట్సాప్‌ నుంచే

* కులం, ఆదాయం, నివాస ధ్రువపత్రాలు

* జనన, మరణ సర్టిఫికెట్లు

* వివాహ రిజిస్ట్రేషన్‌, మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్లు

* విద్యుత్, నీటి, ఆస్తి పన్ను చెల్లింపులు

* రెవెన్యూ, ఆర్టీఏ, పోలీస్, పౌరసరఫరాలు, పంచాయతీ రాజ్, దేవాలయాల సేవలు  వంటి అన్ని ముఖ్య సేవలను పొందవచ్చు.

దరఖాస్తు విధానం ఇలా..

1. అధికారిక మీసేవ వాట్సాప్‌ నంబర్‌ 80969 58096ను ఫోన్‌లో సేవ్‌ చేసుకోవాలి.

2. ఆ నంబర్‌ కు Hi లేదా Menu టైప్ చేసి పంపాలి.

3. వచ్చిన జాబితాలో మీకు కావాల్సిన సేవను ఎంచుకోవాలి.

4. ఆధార్‌ ఆధారిత OTP ధృవీకరణ పూర్తి చేయాలి.

5. అవసరమైన పత్రాలను స్కాన్ చేసి వాట్సాప్‌లోనే అప్‌లోడ్ చేయాలి.

6. ఫీజును ఆన్‌లైన్‌ గేట్‌వే ద్వారా చెల్లించాలి.

7. దరఖాస్తు స్టేటస్‌ SMS ద్వారా వస్తుంది.

8. సర్టిఫికెట్ సిద్ధంగా ఉన్న వెంటనే డౌన్‌లోడ్ లింక్ వాట్సాప్‌లోనే అందుతుంది.

సేవల ప్రక్రియ మొత్తం పారదర్శకంగా, వేగంగా పూర్తి అవుతుందని ప్రభుత్వం హామీ ఇస్తోంది. డిజిటల్ పరిపాలనలో ఇది మరో ముఖ్యమైన మైలురాయిగా భావిస్తున్నారు.