manabharath.com
Newspaper Banner
Date of Publish : 24 November 2025, 2:45 pm Editor : manabharath

రెండు రోజుల్లో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్: సీఎం రేవంత్

రెండు రోజుల్లో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్… కొడంగల్‌లో సీఎం రేవంత్ సంచలన ప్రకటన

మన భారత్, కొడంగల్: తెలంగాణలో పంచాయతీరాజ్ వ్యవస్థకు కీలకమైన సర్పంచ్ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. రెండు, మూడు రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదల కాబోతోందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కొడంగల్ నియోజకవర్గంలోని యెంకేపల్లి రోడ్డులో అక్షయపాత్ర ఫౌండేషన్ మిడ్ డే మీల్స్ సెంట్రలైజ్డ్ కిచెన్ భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన అనంతరం ఆయన ప్రజాసభలో మాట్లాడారు..

సర్పంచ్ ఎన్నికల్లో గ్రామ అభివృద్ధిని అడ్డుకునేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నుకోకూడదని సీఎం పిలుపునిచ్చారు. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం జరిగిన బహిరంగ సభలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

కొడంగల్‌ను రాష్ట్రానికి మోడల్‌గా మారుస్తాం

కొడంగల్ నియోజకవర్గాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని సీఎం తెలిపారు. మహిళల సంక్షేమమే ఆర్థిక అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు.

రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తున్నామని,

 మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామని,

 ఆర్టీసీ బస్సులకు వారినే యజమానులుగా మార్చామని గుర్తుచేశారు.

అదానీ, అంబానీలతో పోటీ పడేలా సోలార్ ప్లాంట్ల నిర్వహణను మహిళలకు అప్పగించామని తెలిపారు. “మీ పిల్లలు చదువుకుంటేనే మీ కుటుంబాల జీవితాల్లో వెలుగులు నిండుతాయి” అని అన్నారు.

ప్రతి విద్యార్థి ఆకలితో ఇబ్బంది పడకూడదు

అక్షయపాత్ర కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలోని 312 ప్రభుత్వ పాఠశాలలలో 28 వేల మంది విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ అందిస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు.

మధ్యాహ్న భోజనాన్ని కేంద్రీకృత వంటశాల ద్వారా మరింత నాణ్యతతో అందించే పనిలో ప్రభుత్వం ముందంజ వేస్తోందన్నారు. “బిడ్డల కోసం తల్లి ఎలా ఆలోచిస్తుందో… అదే విధంగా మా ప్రభుత్వం ఆలోచిస్తుంది” అని భరోసా ఇచ్చారు.

కొడంగల్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి

“ఎడ్యుకేషన్, ఇరిగేషన్ మా ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత” అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కొడంగల్‌లో:

మెడికల్, వెటర్నరీ, అగ్రి,

 పారామెడికల్, నర్సింగ్, ఇంజనీరింగ్ కాలేజీలు,

 ఏటీసీలు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్,

జూనియర్, డిగ్రీ కాలేజీలు, సైనిక్ స్కూల్

అలాంటి కీలక విద్యాసంస్థలు ఏర్పాటు చేశామని తెలిపారు. 16 నెలల్లో కొడంగల్‌ను అంతర్జాతీయ ప్రమాణాల విద్యా కేంద్రంగా మార్చాలని సంకల్పించామని అన్నారు.

ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలు తప్పనిసరిగా చేరాలంటే చర్యలు

ప్రతి ఆడబిడ్డకు ప్రభుత్వం అందిస్తున్న ఇంద్రమ్మ చీరలు ఎలాంటి ఆలస్యం లేకుండా చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

పదేళ్లపాటు ఇందిరమ్మ రాజ్యం తెలంగాణలో కొనసాగేలా పనిచేస్తామని, రాజకీయాలకు అతీతంగా కొడంగల్ అభివృద్ధికి ప్రజలు ముందుకు రావాలని ఆయన కోరారు.