manabharath.com
Newspaper Banner
Date of Publish : 24 November 2025, 2:32 pm Editor : manabharath

పంట నష్టం.. యువ రైతు ఆత్మహత్య

పంట నష్టం… యువ రైతు ఆత్మహత్య

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. డోర్లీ గ్రామానికి చెందిన జలారపు లింగన్న (22) అనే యువరైతు పంట నష్టాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చాకలి కులానికి చెందిన లింగన్న తన తండ్రి జలారపు కిష్టన్న పేరుతో ఉన్న మూడు ఎకరాలు 30 గుంటల పొలంలో కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ సీజన్‌లో పత్తి పంట సాగు కోసం అప్పులు తెచ్చుకున్న లింగన్న, భారీ వర్షాలకు పంట పూర్తిగా దెబ్బతినడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ నెల 23న రాత్రి సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. విషయం గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని తక్షణమే రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.

మృతుడి తల్లి జలారపు విమల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.