కాలుష్య నిరసనల్లో ‘హిడ్మా’ పోస్టర్లు… ఢిల్లీలో వివాదం, కేసు నమోదు
మన భారత్, న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై జరుగుతున్న నిరసనలు కొత్త వివాదానికి దారితీశాయి. కాలుష్య నియంత్రణలో ప్రభుత్వం వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ పలువురు యువకులు ఢిల్లీ గేట్ వద్ద ఆందోళనకు దిగారు. అయితే నిరసన సమయంలో ఇటీవల హతమైన మావో అగ్రనేత హిడ్మా పోస్టర్లు ప్రదర్శించడంతో పరిస్థితి తీవ్రంగా మారింది.
‘బిర్సా ముండా నుంచి మాద్వి హిడ్మా వరకు… మన అడవులు, పర్యావరణం కోసం పోరాటం కొనసాగింది. రెడ్ సెల్యూట్ హిడ్మా’ అంటూ పోస్టర్లపై నినాదాలు కనిపించాయి. పర్యావరణ నిరసనలో హిడ్మా పేరును వినియోగించడం పోలీసులు, భద్రతా సంస్థలను అప్రమత్తం చేసింది.
తర్వాత సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దేశద్రోహ అనుమానాలు, నిషేధిత సంస్థల ప్రచారం వంటి అంశాలపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. నిరసనల్లో పాల్గొన్నవారి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని వారు వెల్లడించారు.
ఈ ఘటనతో ఢిల్లీలో కాలుష్య నిరసనలకు కొత్త మలుపు తిరిగింది. పర్యావరణ సమస్యలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, హిడ్మా పోస్టర్లు చేర్చడం రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది.