manabharath.com
Newspaper Banner
Date of Publish : 24 November 2025, 4:13 am Editor : manabharath

‘కాలుష్య’ కోరల్లో చిక్కుకున్న న్యూ ఢిల్లీ..

‘కాలుష్య’ కోరల్లో చిక్కుకున్న న్యూఢిల్లీ… AQI మళ్లీ ప్రమాద మోడ్‌లో

మన భారత్, న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మరోసారి ఘోర వాయు కాలుష్యపు బారిన పడింది. తెల్లవారుజామున నగరంలోని 20 ప్రధాన జోన్లలో AQI 400 దాటడంతో కాలుష్య నియంత్రణ మండలి (PCB) దీనిని ‘తీవ్రమైన’ కేటగిరీగా ప్రకటించింది. గాలిలో విషతుల్యం పెరిగిపోవడంతో ఉదయం వేళ బయటకు వచ్చిన ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు, ఆస్థమా రోగులు పరిస్థితి మరింత దుర్దశలా ఉంది.

కాలుష్య నిరోధక చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటూ ఢిల్లీవాసుల అసహనం పెరుగుతోంది. వాయు నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తున్నా, సమర్థవంతమైన చర్యలు చేపడుతున్నట్లు కనిపించడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ఢిల్లీ గేట్ వద్ద కొందరు కార్యకర్తలు నిరసనకు దిగారు. అనుమతి లేని ఆందోళనగా పోలిసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి చికాకుగా మారడంతో పోలీసులు నిరసనకారులపై చిల్లీ స్ప్రే ప్రయోగించినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

ఢిల్లీ వాతావరణ కాలుష్యం పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉండటంతో వైద్య నిపుణులు అత్యవసర జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు పర్యావరణ సంస్థలు కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజారోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నాయి.