సర్పంచ్ ఎన్నికలు వేగవంతం – రిజర్వేషన్ గెజిట్ నోటిఫికేషన్లు నేడు జారీ
మన భారత్, హైదరాబాద్: రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ మరింత వేగం పుంజుకుంది. రిజర్వేషన్ల పునర్వివరణ పూర్తి కావడంతో, నేడు అన్ని జిల్లాల కలెక్టర్లు రిజర్వేషన్లపై గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. గ్రామ పంచాయతీలకు సంబంధించిన తాజా రిజర్వేషన్ జాబితాలు జిల్లాలవారీగా అధికారికంగా ప్రచురించబడనున్నాయి.
ఇకపోతే, ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో విచారణ మరికొద్ది గంటల్లో జరగనుంది. కోర్టు తీర్పు ఆధారంగానే ఎన్నికల షెడ్యూలు, నోటిఫికేషన్ విడుదలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) కీలక నిర్ణయం తీసుకోనుంది.
ఈ నెల 25న జరగబోయే కేబినెట్ సమావేశంలో సర్పంచ్ ఎన్నికల తేదీలు ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు సూచిస్తున్నాయి. అంతకుముందే జిల్లాల కలెక్టర్లు ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేయాలని SEC ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
సర్పంచ్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో, రిజర్వేషన్ల గెజిట్ విడుదలతో గ్రామీణ రాజకీయాలు కాస్త వేడెక్కనున్నాయి.