manabharath.com
Newspaper Banner
Date of Publish : 23 November 2025, 6:24 pm Editor : manabharath

అక్రమ వలసదారులపై కఠిన చర్యలు: యూపీ సీఎం

అక్రమ వలసదారులపై కఠిన చర్యలు — జిల్లాల వారీగా డిటెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని యూపీ సీఎం ఆదేశం

మన భారత్, లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అక్రమ వలసదారులపై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభిస్తోంది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో తాత్కాలిక డిటెన్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. విదేశీ పౌరసత్వం కలిగిన వలసదారుల పూర్తి వెరిఫికేషన్ పూర్తయ్యే వరకు వారిని ఈ సెంటర్లలోనే నిర్బంధించాలని ఆయన స్పష్టం చేశారు.

అక్రమంగా రాష్ట్రంలో స్థిరపడిన వారి వివరాలు, నివాస విధానం, పత్రాల నిజానిజాలు ఖచ్చితంగా పరిశీలించాలని సూచించారు. వలసదారుల నేపథ్యం తేలిన తరువాత విధి ప్రకారం స్వదేశాలకు పంపించే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అక్రమ వలసదారుల సమస్య రాష్ట్ర భద్రతకు ప్రమాదమయ్యే అవకాశం ఉందని, కఠిన చర్యలు తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు.

ఇక మరోవైపు కాంగ్రెస్ నేత అజయ్ రాయ్, “8 ఏళ్లుగా అధికారంలో ఉన్న యోగి ప్రభుత్వం ఇప్పుడే కావాలనే హడావిడి చేస్తోంది. ఎన్నికలు దగ్గరపడటంతో అక్రమ వలసదారుల అంశాన్ని రాజకీయంగా ప్రయోజనాల కోసం ఉపయోగిస్తోంది” అంటూ విమర్శలు గుప్పించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఈ నిర్ణయం చర్చకు దారితీసింది. భద్రత, మానవహక్కులు, రాజకీయ ప్రయోజనాలపై వివిధ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.