లోన్ యాప్‌ల మోసాలు మళ్లీ ముదిరిన సంక్షోభం
ఒక్క క్లిక్‌తో రుణం… తర్వాత ఖాళీ అయ్యే అకౌంట్లు, ఆగని వేధింపులు
మన భారత్ , హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులను, ఆసరాగా చేసుకుని నకిలీ రుణ యాప్‌లు ప్రజలను ఉచ్చు వేస్తున్నాయి. తక్షణ రుణం పేరిట ఆకర్షణీయ ప్రకటనలు ఇస్తున్న ఈ ఫేక్ యాప్‌లు, డబ్బులు ఇవ్వడం కంటే ఎక్కువగా వసూలు చేస్తూ బాధితులను తీవ్రంగా వేధిస్తున్నాయి. సోషల్ మీడియాలో ప్రకటన నొక్కిన క్షణం నుంచి వ్యక్తిగత డేటా మొత్తం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి జారిపోతోంది. వడ్డీ పేరుతో పది రెట్లు వసూలు చేసి, చెల్లించకపోతే ఫోటోలను మార్ఫింగ్ చేసి కాంటాక్టులకు షేర్ చేస్తామంటూ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు.
ఒకప్పుడు పర్సనల్ లోన్ పొందడానికి పెద్ద ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు మాత్రం పది నిమిషాల్లోనే రుణం అప్రూవ్ అయ్యే యాప్‌లు పేరుతో దోపిడీలు కొనసాగుతున్నాయి. ఇదే కారణంగా ఈ రుణ యాప్‌ల నుంచి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా గతంలో నమోదయ్యాయి.
271 ఫిర్యాదులు… రూ. 42 లక్షలు అదనంగా వసూళ్లు
గత 11 నెలల్లో రుణ యాప్‌ల వలలో చిక్కుకున్న వారు 271 మంది ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. తీసుకున్న డబ్బుల కంటే రూ. 42 లక్షలు అదనంగా వసూలు చేసినట్లు నమోదైంది. చివరకు వేధింపులు భరించలేక చాలా మంది పోలీసులను ఆశ్రయించారు. చాలా యాప్‌లు నకిలీవేనని, వీటిపై జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వ్యక్తిగత సమాచారం… నేరగాళ్లకు వైభవం
నకిలీ యాప్‌లలో వివరాలు నమోదు చేయగానే మొబైల్‌లోని కాంటాక్ట్లు, ఫొటోలు, డేటా మొత్తం యాక్సెస్ అవుతుంది. తర్వాత అదే డేటా బ్లాక్‌మెయిల్ కోసం వాడుతున్నారు. అవసరాల కోసం రుణం తీసుకున్న వారి జీవితాలను నరకయాతనగా మార్చుతున్నారు.
బాధితుల అరుపులు…
- కడప యువతి కేసు: రూ.50 వేల రుణం తీసుకుని, ఊహించిన దానికంటే ఎక్కువ చెల్లించినా, యాప్ నిర్వాహకులు మళ్లీ డబ్బులు కట్టాలని వేధించారు. బెదిరింపులు భరించలేక ఆమె పోలీసుల వద్ద ఫిర్యాదు చేసింది.
- కడప వ్యాపారి: రూ.32 లక్షల రుణం తీసుకుని చెల్లింపులు చేస్తూనే ఉన్నా, ఫోటోలు షేర్ చేస్తామని బెదిరించడంతో దిగులు చెందిన ఆయన చివరకు పోలీసులను ఆశ్రయించాడు.
- ప్రొద్దుటూరు మహిళ: తీసుకున్న రుణం చెల్లించినప్పటికీ రకరకాల నంబర్ల నుంచి కాల్స్, మెసేజీలు పంపి మళ్లీ డబ్బులు కట్టాలని బలవంతం చేశారు.
నకిలీ రుణ యాప్‌లు ప్రజలను ఎలాగైనా దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. పోలీసులు సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఆకర్షణకు లొంగి తెలియని యాప్‌లలో వివరాలు ఇవ్వకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.