సామూహిక వందేమాతర గీతాలాపన: జాతీయ స్పూర్తికి నాంది
మన భారత్, భైంసా: పట్టణంలోని పూలేనగర్‌లోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ విద్యాపీఠం – సుభద్ర వాటిక నిలయం ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వందేమాతర గీతాలాపన కార్యక్రమం దేశభక్తి సందేశాలతో ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ హాజరై విద్యార్థులతో కలిసి వందేమాతర గేయాన్ని ఆలపించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ..వందేమాతరం గీతం దేశవ్యాప్తంగా స్వరాజ్య కాంక్షను రగిలించిన అమర గేయమని పేర్కొన్నారు. “తెల్లదొరల పాలనను కూలదోయడంలో వందేమాతరం ఓ మంత్రంలా పని చేసింది. ప్రజల్లో ఐక్యత, జాతీయత్వ భావాలను పెంపొందించింది” అని అన్నారు. ఈ మహోన్నత గేయాన్ని రచించిన బంకిమ్ చంద్ర ఛటర్జీ పాత్రను నేటి తరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, అందుకే కేంద్ర ప్రభుత్వం వందేమాతరం 150 సంవత్సరాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నదని తెలిపారు.
దేశంలో కుల, మత విభజన విత్తనాలను కొన్ని రాజకీయ పార్టీలు పెంచుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్, వామపక్ష పార్టీల కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలి అని పిలుపునిచ్చారు. వందేమాతరం స్పూర్తిని అందరూ గ్రహించి, పూర్తి గీతాన్ని సరిగా ఆలపించాలి అని ఎమ్మెల్యే కోరారు.
కార్యక్రమంలో బోధకులు, విద్యార్థులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.