manabharath.com
Newspaper Banner
Date of Publish : 22 November 2025, 5:39 am Editor : manabharath

చేనేత కార్మికులకు న్యాయం చేయాలి: కాశీనాథ్

గాంధీనగర్ చేనేత కార్మికులకు న్యాయం చేయాలి: ఇండ్ల రిజిస్ట్రేషన్–సభ్యత్వం వెంటనే ఇవ్వాలంటూ టి‌యు‌సి‌ఐ డిమాండ్

మన భారత్, నారాయణపేట: నారాయణపేట జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ తాయమ్మ గుడిలో చేనేత కార్మికుల సాధారణ సమావేశం ఘనంగా జరిగింది. చేనేత కార్మిక సంఘం (TUCi) ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వృత్తి ఆధారంగా జీవిస్తున్న కార్మికుల సమస్యలు, హక్కులు, సొసైటీ అన్యాయ నిర్ణయాలు ముఖ్యాంశాలుగా నిలిచాయి.

ఈ కార్యక్రమానికి సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి కె. కాశీనాథ్, చేనేత కార్మిక సంఘం జిల్లా నాయకులు కెంచె నారాయణ పాల్గొని మాట్లాడుతూ.. 1951లో ఏర్పడిన నారాయణపేట చేనేత సహకార సంఘంలో అప్పట్లో 4,265 మంది కార్మికులు సభ్యులుగా ఉన్నారని, గాంధీనగర్ చేనేత సొసైటీ తరఫున 100 మంది లబ్ధిదారులకు ఇండ్లు నిర్మించి ఇచ్చినట్లు గుర్తుచేశారు. కార్మికుల వద్ద నెలకు ₹5 చొప్పున వసూలు చేసి మొత్తం ₹2,475 సొసైటీకి చెల్లించినప్పటికీ, 35 సంవత్సరాలు గడిచినా ఇండ్ల రిజిస్ట్రేషన్ చేయకుండా ప్రభుత్వం, సొసైటీ ఇబ్బంది పెడుతున్నాయి అని ఆరోపించారు.

ఇంట్ల పట్టాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్
సొసైటీ నిర్ణయించిన మొత్తం, ప్రభుత్వ నిర్ణయించిన మొత్తాన్ని చాలా ఏళ్ల కిందటే చెల్లించినప్పటికీ లబ్ధిదారుల పై అన్యాయం జరుగుతోందని కాశీనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం సొసైటీలో 72 మంది మాత్రమే సభ్యులుగా ఉండటం అన్యాయం అని, వందలాది మంది వృత్తి కార్మికుల పేర్లను సొసైటీ తొలగించడం అసహ్యం అన్నారు.

చేనేత కార్మికులకు వెంటనే సభ్యత్వం ఇవ్వాలి
నారాయణపేట పట్టణంలోని నిజమైన చేనేత కార్మికులకు జౌళి శాఖ AD వెంటనే సభ్యత్వం కల్పించాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఎన్నోసార్లు అధికారులు, ప్రజా ప్రతినిధులను కలిసినా స్పందన లేకపోవడం విచారకరం అని కార్మికులు వాపోయారు.
“మా ఇండ్లు మాకు – మా స్థలాలు మాకు రిజిస్టర్ చేయాలి” అని గాంధీనగర్ వాసులు కోరుతున్నారు. లేనిపక్షంలో CPI(ML) మాస్ లైన్, చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో భారీ ఆందోళన తప్పదని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో సంఘం నాయకులు నరసింహులు, నాగేందర్, సచిన్ తదితరులు పాల్గొన్నారు.