నారాయణపేటలో పిడిఎస్‌యూ మహాసభలు ప్రారంభం
విద్యార్థుల సమస్యలపై రెండు రోజుల చర్చలు, నాయకుల కీలక ప్రసంగాలు
మన భారత్, నారాయణపేట: నారాయణపేట జిల్లా పిడిఎస్‌యూ (PDSU) మూడవ మహాసభలను విజయవంతం చేయాలని విద్యార్థి సమూహాలను పిడిఎస్‌యూ జిల్లా అధ్యక్షులు ఎస్. సాయి కుమార్ పిలుపునిచ్చారు. నేడు, రేపు—రెండు రోజుల పాటు జిల్లా కేంద్రంలో జరిగే ఈ మహాసభలను ఘనంగా నిర్వహించేందుకు శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ, శనివారం ఉదయం 11 గంటలకు విద్యార్థి ప్రదర్శనతో మహాసభలు ప్రారంభమై, అనంతరం మెట్రో గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఇలెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య హాజరుకానుండగా, ప్రధాన వక్తగా పి.వై.ఎల్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. హన్మేష్ పాల్గొననున్నారు. ఆహ్వాన సంఘం అధ్యక్షుడు డాక్టర్ నగేష్, పిడిఎస్‌యూ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె. పృథ్వి, ఎస్. అనిల్ తదితరులు పాల్గొని విద్యారంగ సమస్యలు, ప్రభుత్వ విధానాలు, సమాజంలోని అసమానతలపై ప్రసంగించనున్నారు.
ఇరవై మూడవ తేదీన జిల్లా వ్యాప్తంగా వచ్చిన ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం జరుగనుంది. ఇందులో విద్యార్థి సమస్యలపై గత పోరాటాలపై సమీక్ష జరిపి, భవిష్యత్ కార్యాచరణపై చర్చలు నిర్వహించనున్నట్లు సాయి కుమార్ వెల్లడించారు.
విలేకరుల సమావేశంలో జిల్లా కార్యదర్శి బి. అజయ్ కుమార్, ఉపాధ్యక్షుడు గౌస్, సహాయ కార్యదర్శి వెంకటేష్, కోశాధికారి మహేష్, నేతలు సురేష్, రాజు పాల్గొన్నారు.