manabharath.com
Newspaper Banner
Date of Publish : 21 November 2025, 6:47 pm Editor : manabharath

ఉర్సు ఉత్సవాలు ఘనంగా ప్రారంభం..

అర్వపల్లి దర్గా ఉర్సు ఉత్సవాలు ఘనంగా ప్రారంభం

మన భారత్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలంలోని అర్వపల్లి హజ్రత్ ఖాజా నసీరుద్దిన్ బాబా దర్గా ఉర్సు ఉత్సవాలు నేడు ఘనంగా ప్రారంభం కానున్నాయి.ప్రకృతి ఒడిలో, అర్వపల్లి పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో పెద్ద పర్వతం పక్కన నెలకొన్న ఈ దర్గా హిందూ–ముస్లిం మతసామరస్యానికి ప్రతీకగా ప్రసిద్ధి చెందింది.

దర్గా సమీపంలోని పాత రాజ భవనాల అవశేషాలు ఈ ప్రాంతం చారిత్రక ప్రాధాన్యాన్ని మరింత వెలుగులోనికి తెస్తాయి. పూర్తిగా రాతితో నిర్మించబడిన ఈ దర్గా ఎల్లప్పుడూ చల్లని వాతావరణం కలిగి ఉండటం ప్రత్యేకత.

గతంలో చుట్టూ అడవులతో ఉండటంతో భక్తులకు చేరువకాన దర్గా, 1985లో అర్వపల్లి పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మహ్మద్ హమీద్ కృషితో తిరిగి వెలుగులోకి వచ్చింది. దాతల సహకారంతో దర్గా చుట్టూ గద్దె, షెడ్లు, వరండా అభివృద్ధి చేయడం ద్వారా భక్తులకు సౌకర్యాలు పెంచారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది రెండు రోజుల పాటు ఉర్సు ఉత్సవాలు విశేషోత్సాహంతో నిర్వహిస్తున్నారు.

అర్వపల్లి పోలీస్ స్టేషన్ నుండి గంధం మిరవణి దర్గాకు చేరుతుంది. రాత్రికి ప్రత్యేక ఖవ్వాలి కార్యక్రమం నిర్వహించబడుతుంది. రేపు, నవంబర్ 22న దీపారాధన కార్యక్రమాలు జరుగనున్నాయని ముజవారి సయ్యద్ అలీ తెలిపారు.

ఈసారి ఉత్సవాల కోసం దర్గాకు రంగులు వేసి, దీపాల అలంకరణ చేసి పండుగ వాతావరణం సృష్టించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వేలాది మంది భక్తులు అర్వపల్లి దర్గాకు తరలి రానున్నారు.