manabharath.com
Newspaper Banner
Date of Publish : 19 November 2025, 9:34 am Editor : manabharath

తెలంగాణలో కోటి మహిళలకు “కోటి” చీరలు:

తెలంగాణలో కోటి మహిళలకు కోటి చీరలు: రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ప్రారంభించిన భారీ సంకల్పం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డను గౌరవించాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘కోటి మహిళలకు–కోటి చీరలు’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 2034 నాటికి రాష్ట్రంలో కోటి మందిని కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు.

మాజీ ప్రధానమంత్రి, భారతరత్న ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా, నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె విగ్రహానికి పుష్పాంజలి అర్పించిన అనంతరం, పలు మహిళా సమాఖ్య ప్రతినిధులకు చీరలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి మహిళలకు చీరల పంపిణీని అధికారికంగా ప్రారంభించారు.

చీరల పంపిణీ షెడ్యూల్:

  • మొదటి విడతలో డిసెంబర్ 9 వరకు గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల చీరలు పంపిణీ
  • మార్చి 1 నుంచి 8 వరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పట్టణ, మున్సిపల్ ప్రాంతాల్లో పంపిణీ

మహిళల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను గుర్తుచేస్తూ, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు, జీరో వడ్డీ రుణాలు, పెట్రోల్ బంక్‌ల కేటాయింపు, ₹500కు గ్యాస్ సిలిండర్‌, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, బస్సులకు మహిళలను యజమానులుగా నిలపడం వంటి నిర్ణయాలను వివరించారు. త్వరలో మహిళలకు సోలార్ పవర్ ప్లాంట్లు అందించే ప్రత్యేక కార్యాచరణను అమలు చేయనున్నట్లు తెలిపారు.

ఇందిరా గాంధీ బడుగు, బలహీన వర్గాల కోసం తీసుకున్న ధైర్యమైన నిర్ణయాలు దేశానికి స్ఫూర్తిగా నిలిచాయని పేర్కొంటూ, చీరల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. “ప్రతి ఆడబిడ్డకు చీర అందుతుంది… ఎవరికీ ఇబ్బంది ఉండదు. ఇది గౌరవ సూచక కార్యక్రమం” అని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ధనసరి అనసూయ సీతక్క , దామోదర రాజనర్సింహ , కోమటిరెడ్డి వెంకటరెడ్డి , కొండా సురేఖ , పొన్నం ప్రభాకర్ , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , వాకిటి శ్రీహరి మేయర్ గద్వాల విజయలక్ష్మి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.