manabharath.com
Newspaper Banner
Date of Publish : 19 November 2025, 7:17 am Editor : manabharath

ప్రభుత్వాల కంటే వేగంగా స్పందించిన మహానుభావుడు సత్యసాయి” – సీఎం చంద్రబాబు

ప్రభుత్వాల కంటే వేగంగా స్పందించిన మహానుభావుడు సత్యసాయి” – సీఎం చంద్రబాబు

మన భారత్, పుట్టపర్తి: సేవ, ప్రేమ, మనిషితనం అనే గొప్ప విలువలకు సత్యసాయి బాబా ప్రతి రూపమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. పుట్టపర్తిలో కొనసాగుతున్న సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొని ఆయన మాట్లాడారు.

చంద్రబాబు మాట్లాడుతూ, “భూమిపై మనకు తెలిసిన, మనం ప్రత్యక్షంగా చూసిన దైవస్వరూపం సత్యసాయి బాబానే. ఆయన చేసిన సేవలకు సాటి ఇంకెవరూ లేరు. ఆయన 1600 గ్రామాల్లో 30 లక్షల మందికి తాగునీరు అందించారు. 102 విద్యాలయాలు, అనేక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, వైద్య కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల్లో 200 కేంద్రాల ద్వారా సత్యసాయి ట్రస్ట్ సేవలందిస్తోంది. ఈ సేవా కార్యక్రమాల్లో 7 లక్షల మందికి పైగా వాలంటీర్లు పాల్గొంటున్నారు” అని పేర్కొన్నారు.

అదే సమయంలో బాబా సేవా భావాన్ని ప్రత్యేకంగా కొనియాడుతూ, “ప్రభుత్వాల కంటే వేగంగా, క్షణాల్లో స్పందించిన మహానుభావుడు సత్యసాయి. సమస్య ఎక్కడున్నా తెలుసుకుని వెంటనే సహాయం అందించే వారు. ఆయన చూపిన మార్గంలో మనమంతా నడిస్తే సమాజం మరింత వెలుగొందుతుంది” అని అన్నారు.

సత్యసాయి బోధనలు, ఆయన సేవామార్గం తరతరాలకు మార్గదర్శకంగా ఉంటాయని సీఎం చంద్రబాబు తెలిపారు.