ఐ-బొమ్మ రవి ప్రయత్నం ఫలించలేదు… డేటా క్లియర్ చేసి, పరికరాలు దాచినా పోలీసులకు దొరికిపోయిన సాక్షాలు
మన భారత్, హైదరాబాద్: ఐ-బొమ్మ కేసులో నిందితుడు రవి అరెస్ట్ సందర్భంగా కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అరెస్ట్‌కు ముందు గంటన్నరపాటు తన ఇంటి తలుపులు తెరవకుండా రవి ఆలస్యం చేసినట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ లోపులోగానే టెలిగ్రామ్ మరియు మొబైల్‌లోని ముఖ్యమైన డేటాను పూర్తిగా క్లియర్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
అంతేకాక, సాక్ష్యాలు దొరకకుండా చేయడానికి రవి తన ల్యాప్టాప్‌ను బాత్రూమ్ రూఫ్ కింద దాచగా, మొబైల్ ఫోన్‌ను అల్మారాలో దాచినట్టు విచారణలో తెలిసింది. అయితే ఈ ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయని, పరికరాలు పూర్తిగా స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్టు అధికారులు తెలిపారు.
ప్రారంభ విచారణలో రవి నేరాన్ని అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్ట్ పేర్కొంది. అలాగే స్నేహితులు, బంధువులతో ఎలాంటి సంబంధాలు లేవని చెప్పినట్టు కూడా అందులో నమోదు చేశారు. ఐ-బొమ్మ కేసులో రవి అరెస్ట్‌తో కీలక దశ మొదలైందని, మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పోలీసులు సూచించారు.