ఐబొమ్మ కేసులో ఈడీ ప్రవేశం – మనీలాండరింగ్ కోణంపై దృష్టి
మన భారత్, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఐబొమ్మ కేసులో ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తమకు పంపించాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌కు ఈడీ అధికారిక లేఖ రాసింది. ఐబొమ్మ వ్యవహారంలో భారీ స్థాయిలో మనీలాండరింగ్ జరిగిందన్న అనుమానం నేపథ్యంలో ఈడీ ప్రత్యేక దర్యాప్తును ప్రారంభించింది.
కేసులో ప్రధాన నిందితుడు రవి ఖాతాల నుంచి ఇప్పటివరకు రూ.3.5 కోట్లు ఫ్రీజ్ చేసినట్టు పోలీసులు ఇప్పటికే వెల్లడించారు. నెట్‌వర్క్ ఖర్చులు, డిజిటల్ ట్రాన్సాక్షన్లు, విదేశీ ఫండింగ్ వంటి అంశాలను కూడా ఈడీ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 14న అరెస్టైన రవి ప్రస్తుతం చంచల్‌గూడ సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. సైబర్ నేరాలు, కాపీరైట్ ఉల్లంఘనలు, విదేశీ లావాదేవీలు వంటి అంశాలపై ఈడీ మరింత లోతుగా విచారణ జరపనుంది. ఇప్పటికే పలు డిజిటల్ పరికరాలు, సర్వర్లు, డొమైన్ లింకులు పరిశీలనలో ఉన్నాయి.
ఈడీ అడుగుపెట్టడంతో కేసు మరింత వేగం పందే అవకాశం ఉందని న్యాయవర్గాలు అంచనా వేస్తున్నాయి.