సకురాజిమా అగ్నిపర్వతం మళ్లీ బద్దలైంది… 4.4 కిమీ ఎత్తుకు బూడిద; జపాన్‌లో అలెర్ట్
మన భారత్, టోక్యో: జపాన్‌లో అత్యంత యాక్టివ్ అగ్నిపర్వతాల్లో ఒకటైన సకురాజిమా మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. ఈరోజు వరుస పేలుళ్లు సంభవించడంతో భారీగా బూడిద వాయుమండలంలోకి ఎగిసిపోయింది. అగ్నిపర్వతం నుండి వెలువడిన బూడిద 4.4 కిలోమీటర్ల ఎత్తుకు చేరిందని జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. గత 13 నెలల్లో ఇంత ఎత్తుకు బూడిద ఎగసిన ఘటన ఇదే మొదటిసారి అని అధికారులు పేర్కొన్నారు.
పేలుళ్ల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో, ముందుజాగ్రత్త చర్యగా కగోషిమా విమానాశ్రయంలో 30 విమానాలను రద్దు చేశారు. బూడిద వ్యాప్తి కారణంగా విమానాల టేకాఫ్–ల్యాండింగ్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
సకురాజిమా అగ్నిపర్వతం ప్రమాదకరమైన చరిత్ర కలిగి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2019లో ఈ అగ్నిపర్వతం 5.5 కిలోమీటర్ల ఎత్తుకు బూడిద విసిరిన ఘటన ఇంకా జ్ఞాపకాల్లో ఉంది. స్థానిక ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని జపాన్ ప్రభుత్వం సూచించింది.