manabharath.com
Newspaper Banner
Date of Publish : 16 November 2025, 3:16 am Editor : manabharath

ibomma రవి: సీఈవో నుంచి పైరసీ దాకా..

ibomma రవి: సీఈవో నుంచి పైరసీ దాకా – టెక్ ప్రతిభనుంచి నేర మార్గం వరకు విచిత్ర ప్రయాణం

మన భారత్, హైదరాబాద్: పేరుగాంచిన పైరసీ మూవీ వెబ్‌సైట్ ibomma ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టుతో సైబర్ క్రైమ్ విభాగం కీలక విజయాన్ని సాధించింది. నిన్న కూకట్‌పల్లిలో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతని వ్యక్తిగత జీవితం, గత ఉద్యోగ చరిత్ర, పైరసీ కార్యకలాపాలపై పలు ఆసక్తికర అంశాలను బయటపెట్టారు.

ఒకప్పటి సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈవోగా వెలిగిన రవి, గతంలో ER ఇన్ఫోటెక్ పేరు మీద ఐటీ సంస్థను నడిపినట్లు సమాచారం. టెక్ రంగంలో మంచి పేరుతో ముందుకు సాగిన అతడి జీవితం, ఐదేళ్ల క్రితం భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత పూర్తిగా మారిపోయిందని సైబర్ క్రైమ్ వర్గాలు చెబుతున్నాయి.

విడాకుల అనంతరం అతడు పైరసీ రంగంలోకి అడుగుపెట్టాడు. సర్వర్లను ఈజీగా హ్యాక్ చేయగల మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం అతడికి ఉండటంతో, తక్కువ సమయంలోనే పలు దేశాల నుంచి సర్వర్లను ఆపరేట్ చేస్తూ ibomma వంటి ప్లాట్‌ఫాంలను నడిపినట్లు తెలుస్తోంది.

సైబర్ నిపుణుల చెప్పిన వివరాల ప్రకారం, రవి విదేశాల్లో ఉన్నట్లు కనిపిస్తూ తన ట్రాకింగ్‌ను కస్టడీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినా, ఇటీవల గోప్యంగా కూకట్‌పల్లికి వచ్చిన విషయాన్ని పోలీసులు పసిగట్టారు. ఆ తర్వాత జరిగిన ఆపరేషన్‌లో అతడిని అరెస్టు చేశారు.

పోలీసులు ఇప్పుడు అతడు నిర్వహించిన సర్వర్లు, ఫైనాన్షియల్ నెట్‌వర్క్, ఈ పైరసీ రాకెట్‌లో పాల్గొన్న ఇతరులపై మరింత లోతైన దర్యాప్తు ప్రారంభించారు. తెలుగు సినీ పరిశ్రమను కోట్ల రూపాయల నష్టం చేకూర్చిన ibomma నెట్‌వర్క్‌ను పూర్తిగా చేధించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

#iBommaArrest #RaviIbomma #PiracyNews #CyberCrime #TollywoodPiracy #TechToCrime #ManaBharath.com