manabharath.com
Newspaper Banner
Date of Publish : 15 November 2025, 4:47 am Editor : manabharath

నేడు బిహార్.. రేపు బెంగాల్ బీజేపీ దే

నేడు బిహార్ రేపు బెంగాల్ కూడా BJPదే’: కేంద్ర మంత్రి బండి సంజయ్ ధీమా

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక – బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మళ్లీ వేడెక్కిన రాజకీయ దాడులు

మన భారత్, హైదరాబాద్ :బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA స్పష్టమైన విజయం సాధించిందని, ఇదే ధోరణి రాబోయే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కూడా కొనసాగుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో టి-బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. “బిహార్‌లో ఒక్క బీజేపీ మాత్రమే 92 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉప ప్రాంతీయ పార్టీగా మారిపోయింది,” అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీపై వ్యంగ్యంగా మాట్లాడుతూ, “ఆయన పని అయిపోయింది, ఇప్పుడు పబ్‌జీ ఆడుకోవచ్చు” అని విమర్శించారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలుపుపై స్పందించిన బండి సంజయ్, ఈ విజయం వాస్తవానికి కాంగ్రెస్‌ది కాదని, ఎంఐఎం మద్దతుతో సాధించిందని ఆరోపించారు. “తెలంగాణ హిందూ సమాజం ఒక్కటైతే బీజేపీని ఆపడం ఎవరి వల్ల కాదు,” అని ఆయన పిలుపునిచ్చారు. ఇక బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఎలా వ్యవహరిస్తుందో ప్రశ్నిస్తూ, కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై తీవ్ర విమర్శలు చేశారు.

డిపాజిట్ రాకపోయినా భవిష్యత్తులో అధికారంలోకి రావడం బీజేపీ లక్ష్యమని, స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. “గ్రామాల అభివృద్ధి జరగాలంటే బీజేపీని గెలిపించాలి,” అని ప్రజలకు సందేశం ఇచ్చారు.

టీఏ బీజేపీ చీఫ్ రామచందర్ రావు స్పందన

బిహార్‌లో NDAకు ప్రజలు పట్టం కట్టారనీ, కాంగ్రెస్ ఒక్క సీటుకే పరిమితమైందని రామచందర్ రావు చెప్పారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎంఐఎం మద్దతుతోనే కాంగ్రెస్ గెలిచిందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. “హుజూరాబాద్, దుబ్బాకలో కాంగ్రెస్ ఓడిపోయింది. ఇక్కడి నుంచే తెలంగాణలో BJP అధికారంలోకి వచ్చే మార్గం ప్రారంభమవుతుంది,” అని పేర్కొన్నారు.

బీజేపీ శాసనసభ పక్షనేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను బ్లాక్ మెయిల్ చేసి ఓట్లు పడగొడుతుందని దుయ్యబట్టారు. “బ్లాక్‌మెయిల్ రాజకీయాలు మానుకోండి,” అని కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు.

Bandi Sanjay, Bihar Elections, Bengal Elections Prediction, Jubilee Hills By-Election, Telangana BJP, Political War of Words