జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలు కాంగ్రెస్ ఐక్యతకు నిదర్శనం: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌లో మీడియాతో ముఖ్యమంత్రి చిట్‌చాట్
మన భారత్, హైదరాబాద్, నవంబర్:
జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అఖండ మెజారిటీతో గెలుపొందడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో చిట్‌చాట్ చేస్తూ, పీసీసీ నాయకత్వం నుంచి కార్యకర్త స్థాయి వరకు అందరూ ఏకతాటిపై పని చేయడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. “కార్యకర్తల ఐక్యతనే ఈ విజయం నిరూపించింది. ఈ గెలుపు పూర్తిగా మా కార్యకర్తలకు అంకితం,” అని తెలిపారు.
రెండేళ్లుగా నగరాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన పలు కీలక ప్రాజెక్టులకు ఈ ఉపఎన్నిక తీర్పు ప్రజల ఆమోదమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. మెట్రో విస్తరణ, మూసీనది ప్రక్షాళన, ఫోర్త్ సిటీ నిర్మాణం, రీజినల్ రింగ్ రోడ్డు వంటి పథకాలకు ప్రజలు మద్దతు తెలుపారని వెల్లడించారు. “ఈ ఫలితాలు మా బాధ్యతను రెట్టింపు చేశాయి. వచ్చే మూడేళ్లు అభివృద్ధి, పేదల సంక్షేమమే మా మంత్రం,” అని స్పష్టం చేశారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి ఇకపై ప్రభుత్వ బాధ్యతేనని పేర్కొంటూ, అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినా ప్రజలు రెండేళ్ల పాలనను గమనించి ఈ తీర్పు ఇచ్చారని చెప్పారు. GHMC ఎన్నికల్లో కూడా పార్టీ ఇదే ఊపుతో ముందుకు సాగుతుందని తెలిపారు.
బడ్జెట్, ప్రాజెక్టులు, పౌరసౌకర్యాల అభివృద్ధి పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. చెరువులు, కుంటలు కబ్జాలకు గురికాకుండా చర్యలు ప్రారంభించామని, మూసీ ప్రక్షాళనతో నగరానికి కొత్త గుర్తింపు తీసుకురావడమే లక్ష్యమన్నారు. సోషల్ మీడియాలో బీఆర్‌ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మబోరని స్పష్టం చేశారు.
హైడ్రా, ఈగిల్ ఫోర్స్ వంటి సంస్థలను ప్రజల భద్రత, సంక్షేమం కోసం తీసుకొచ్చామని పేర్కొంటూ, కేంద్ర నిధుల విషయంలో యూనియన్ మంత్రి కిషన్‌రెడ్డి సహకారం అందించడం లేదని విమర్శించారు. “ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా – ప్రజలకు సేవ చేయడం కాంగ్రెస్ లక్ష్యం. ఈ గెలుపు మా బాధ్యతను మరింత పెంచింది,” అని ముఖ్యమంత్రి తెలిపారు.