manabharath.com
Newspaper Banner
Date of Publish : 14 November 2025, 2:50 pm Editor : manabharath

పిల్లల అభ్యాసంపై ఆందోళనలు..

పిల్లల అభ్యాసంపై ఆందోళనలు: సంప్రదాయ విలువలకు దూరం..తల్లిదండ్రులదే బాధ్యత?

మన భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పిల్లల అభ్యాసం పై చాప కింద నీరులా ఆందోళనలు మొదలవుతున్నాయి. “మొక్కై వంగనిది మానై వంగునా?” అనే సామెత పిల్లల పెంపకంపై నేటికీ వర్తిస్తుంది. భారతీయ సంప్రదాయంలో పిల్లలకు ఐదేళ్ల వయస్సు వచ్చాక అక్షరాభ్యాసం ప్రారంభించడం, ‘ఓం నమః శివాయ’ వంటి దైవస్మరణతో విద్యారంభం చేయడం ఒక పవిత్ర ఆచారంగా ఉండేది. అయితే, కాలానుగుణ మార్పులతో ఈ సంస్కారం నీరుగారిపోతోంది.

నేటి పిల్లలు విద్యాభ్యాసం ప్రారంభించే దశలోనే ‘బా బా బ్లాక్ షీప్’, ‘డింగ్ డాంగ్ బెల్…’ వంటి అర్థం లేని పాటలు, నర్సరీ రైమ్‌లు నేర్చుకుంటున్నారు. వీటికి విలువలు, సంస్కృతి, నీతి బోదన వంటి అంశాలు లేకపోవడం వల్ల చిన్నప్పటి నుంచే పిల్లలు సంస్కారానికి దూరమవుతున్నారని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పిల్లలపై పెడ ప్రభావాలు పడటానికి ప్రధాన కారణం తల్లిదండ్రులే అని నిపుణులు సూచిస్తున్నారు.
మొక్క చిన్నప్పుడే వంగితేనే అది సూటిగా ఎదగదన్నట్టుగా, చిన్నతనంలోనే క్రమశిక్షణ, నీతి, దైవభక్తి, మానవతా విలువలను బోధించడం అత్యంత అవసరమని వారు చెబుతున్నారు.

నేటి వేగవంతమైన జీవనశైలిలో, మొబైల్, టీవీ, డిజిటల్ వినోదాల వలయం పిల్లలను మరింత దూరం చేస్తున్న సందర్భంలో తల్లిదండ్రులు పిల్లలపై సమయాన్ని కేటాయించడం, వారికి భారతీయ సంస్కృతి, సాంప్రదాయ విలువలతో కూడిన విద్యను అందించడం ముఖ్యమని సూచిస్తున్నారు.

సమాజంలో ఆదర్శ పౌరులుగా ఎదగాలంటే చిన్ననాటి నేర్పే పాఠాలే భవిష్యత్‌ వ్యక్తిత్వానికి పునాది. అందుకే విద్య, సంస్కారం, క్రమశిక్షణలో మార్పు తల్లిదండ్రుల నుంచే ప్రారంభం కావాలని నిపుణులు సూచిస్తున్నారు.

Indian-Tradition-Parenting-Values-Child-Discipline