manabharath.com
Newspaper Banner
Date of Publish : 14 November 2025, 7:16 am Editor : manabharath

పెరిగిన కూరగాయల ధరల..

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరల దూకుడు.. మధ్య తరగతిపై మరింత భారం

మన భారత్‌, ములుగు: తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతూ వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మొంథా తుఫాన్ ప్రభావం, కార్తీకమాసం డిమాండ్, రవాణా అంతరాయాలు కలిసి కూరగాయల మార్కెట్‌లో భారీ అస్థిరతను సృష్టించాయి. నగరాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా అన్ని చోట్లా కూరగాయల ధరలు మండిపోతున్నాయి.

హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ, వరంగల్ వంటి ప్రధాన నగరాల్లోనే కాదు, ములుగు జిల్లాలోని గ్రామీణ రైతు బజార్లలో కూడా పలుచోట్ల కిలోకు రూ.100–120 వరకు పలుకుతున్నాయి. చిక్కుడు, గోబి, క్యారెట్, టమాటో, దోసకాయ, బీరకాయ, మిరపకాయ, వంకాయ వంటి ప్రతిరోజు వంటగదిలో ఉండే కూరగాయలే మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షలుగా మారాయి. పావు కేజీకి కూడా రూ.30–35 కంటే తక్కువకు లభించడం లేదు.

ఇటీవల మొంథా తుఫాన్ కారణంగా పలు జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పొలాల్లో నీరు నిల్వ ఉండటం, పంటలు కుళ్లిపోవడం, సరఫరా గొలుసు దెబ్బతినడంతో మార్కెట్‌లో సరుకు కొరత ఏర్పడింది. రవాణా సమస్యలు, పెరిగిన డిమాండ్ కూడా ధరల పెరుగుదలకు కారణమయ్యాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ధరలు స్థిరపడాలంటే సరఫరా వ్యవస్థ సాధారణ స్థితికి రావాలి. రాబోయే రెండు వారాల్లో వాతావరణం అనుకూలిస్తే మాత్రమే ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.