manabharath.com
Newspaper Banner
Date of Publish : 14 November 2025, 7:06 am Editor : manabharath

మేడారం జాతరకు 3,800 ఆర్టీసీ బస్సులు సిద్ధం: మంత్రి

మేడారం జాతరకు భారీ ఏర్పాటు 3,800 ఆర్టీసీ బస్సులు సిద్ధం: మంత్రి పొన్నం ప్రభాకర్

మన భారత్ , హైదరాబాద్: దక్షిణ భారతదేశపు కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు రాష్ట్ర ప్రభుత్వం మహా ఏర్పాట్లు ప్రారంభించింది. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహోత్సవానికి కోటి మందికి పైగా భక్తులు రానుండటంతో, రవాణా, వసతులు, భద్రత అంశాల్లో ప్రభుత్వం అత్యంత శ్రద్ధ చూపుతోంది.

వచ్చే సంవత్సరం జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న మేడారం జాతర కోసం ఈసారి భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తుల రాకపోకలు సాఫీగా సాగేందుకు ఏకంగా 3,800 ఆర్టీసీ బస్సులను నడపనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.

 

భక్తుల కోసం ఆర్టీసీ మహా ఆపరేషన్

సచివాలయంలో గురువారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి చర్యలను సమీక్షించారు. మేడారం జాతరకు తరలివచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక రూట్లు, అదనపు సర్వీసులు, పార్కింగ్ స్థలాలు, అత్యవసర సహాయక కేంద్రాలపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

వరంగల్ ఆర్ఎండీ, కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్‌లు, సివిల్ ఇంజనీర్లతో కూడిన బృందం ఇప్పటికే మేడారం ప్రాంతంలో పర్యటించి భక్తుల రద్దీ, రోడ్ల పరిస్థితులు, పార్కింగ్ సౌకర్యాలను పరిశీలించింది.

రేవంత్ సర్కార్ భారీ నిధులు విడుదల

మేడారం జాతర కోసం రోడ్ల అభివృద్ధి, తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, వైద్య శిబిరాలు, అదనపు భద్రతా చర్యలపై ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాతరలో పాల్గొనేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు.

జనసంద్రంగా మారబోయే మేడారం

సమ్మక్క–సారలమ్మ తల్లులను దర్శించుకోవడానికి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ఓడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ సహా పలు రాష్ట్రాల నుండి లక్షలాది భక్తులు తరలివస్తారు. నాలుగు రోజుల పాటు వనభూమి మేడారం ఆధ్యాత్మిక శోభతో నిండిపోనుంది.