సీఎం రేవంత్‌పై దాసోజు శ్రవణ్ తీవ్రమైన ఆరోపణలు మ “ధర్మమే గెలుస్తుంది, అక్రమాలు బయటపడతాయి”
మన భారత్, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంటున్న తరుణంలో, సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన, ఎన్నికల ప్రక్రియలో జరిగిన అక్రమాలపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఎన్ని అక్రమాలు జరిగినా చివరికి ధర్మమే గెలుస్తుందని శ్రవణ్ వ్యాఖ్యానించారు.
బైపోల్స్‌లో ఎంఐఎం కూడా కాంగ్రెస్‌కు సహకరిస్తూ అక్రమాలకు పాల్పడిందని, పోలీసులే బోగస్ ఓటింగ్‌కు సహకరించడం ప్రత్యక్షంగా చూశామని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. కాగ్ రిపోర్ట్ సీఎం రేవంత్ రెడ్డి పాలనలో జరిగిన అవకతవకలను బట్టబయలుచేసిందని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను భారీ అప్పుల్లో ముంచేశారని విమర్శించారు.
అనుభవం లేని ముఖ్యమంత్రి ఉంటే ఇలాగే తారుమారులు జరుగుతాయని శ్రవణ్ వ్యాఖ్యానిస్తూ, “రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ రంగాన్ని సర్వనాశనానికి గురిచేశారు” అని మండిపడ్డారు. హైడ్రా పేరుతో ఆర్ఆర్ టాక్స్ అంటూ దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. గత రెండేళ్లలోనే రూ.3.48 వేల కోట్ల అప్పులు తెచ్చిన తీరు బాధాకరమని పేర్కొన్నారు.
ఫిరాయింపు కేసుల విచారణ సందర్భంగా సందర్శకులు, మీడియాపై నిషేధం విధించడం రాజ్యాంగ విరుద్ధమని శ్రవణ్ అన్నారు. “ఇది స్పీకర్ గాని, ముఖ్యమంత్రి గాని స్వంత వ్యవహారం కాదు… దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లుంది” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలకు కూడా ప్రవేశం నిరాకరించడం విచిత్రమన్నారు.
కేసులు వాదించే అడ్వకేట్లు సెల్‌ఫోన్లు తీసుకురావద్దని ఆదేశించడం సరైంది కాదని, సుప్రీంకోర్టులో ఫుల్ బెంచ్ వాదనలు జరిగినప్పుడు కూడా సెల్‌ఫోన్లను అనుమతిస్తారని శ్రవణ్ గుర్తుచేశారు. స్పీకర్ కార్యాలయం విడుదల చేసిన బులెటిన్‌ను తక్షణమే ఉపసంహరించాల్సిందిగా లేఖ రాశానని తెలిపారు.
ఫిరాయింపు విచారణను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేసిన దాసోజు శ్రవణ్, “ప్రజల ముందే నిజాలు వెలుగులోకి రావాలి” అని అన్నారు.