హైదరాబాద్‌ను గ్లోబల్ గేట్‌వేగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి
మన భారత్, ఢిల్లీ: తెలంగాణను ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుల ప్రధాన కేంద్రంగా నిలపడం కాంగ్రెస్ ప్రభుత్వ అత్యంత ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన యూఎస్–ఇండియా స్ట్రాటజిక్ ఫోరం (USISPF) వార్షిక సమ్మిట్‌లో పాల్గొన్న సీఎం, ‘తెలంగాణ రైజింగ్–2047’ విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించి రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనపై ప్రతిష్టాత్మక రోడ్‌మ్యాప్‌ను పెట్టుబడిదారుల ముందుంచారు.
గత 23 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాలను వివరించిన సీఎం రేవంత్ రెడ్డి, “హైదరాబాద్ అంతర్జాతీయ ప్రమాణాలతో, ప్రపంచ పెట్టుబడిదారులకు అత్యంత భద్రమైన గమ్యస్థానంగా ఎదుగుతోంది” అని చెప్పారు. ఆసియా మధ్యలో వ్యూహాత్మక భౌగోళిక స్థానం, ఉత్తమ వాతావరణం, ప్రగతి దిశగా దూసుకెళ్తున్న యువ శక్తి తెలంగాణకు ‘గ్లోబల్ అడ్వాంటేజ్’నిస్తున్నాయని ఆయన వెల్లడించారు.
భారతదేశంలో పెట్టుబడులు ప్రవేశించే ప్రధాన ద్వారం హైదరాబాద్ అని పేర్కొన్న సీఎం, “గత 35 ఏళ్లుగా తెలంగాణలో ఉన్న ప్రతి ప్రభుత్వం పెట్టుబడిదారులకు అండగా నిలిచింది. ఆ పంథాను కాంగ్రెస్ మరింత బలపరుస్తుంది” అని తెలిపారు. జీసీసీలు, టెక్ కంపెనీలు, మాన్యుఫ్యాక్చరింగ్ దిగ్గజాలను భాగ్యనగర్‌ను తమ తదుపరి గమ్యస్థానంగా ఎంచుకోవాలని ఆయన ఆహ్వానించారు.
మహిళా సాధికారిత, నాణ్యమైన విద్య, స్కిల్ డెవలప్‌మెంట్, మెరుగైన జీవన ప్రమాణాలు, సమగ్ర పట్టణాభివృద్ధి హైదరాబాద్‌కు ‘నూతన అంతర్జాతీయ నగర’ రూపాన్ని తీసుకొస్తాయని సీఎం వివరించారు. 30 వేల ఎకరాల్లో రూపుదిద్దుకోనున్న భారత్ ఫ్యూచర్ సిటీ దేశంలోనే సరికొత్త అర్బన్ మోడల్‌గా నిలుస్తుందన్నారు.
మూసీ నదీ పునరుజ్జీవనం పూర్తికాగానే లండన్, దుబాయి, సియోల్, టోక్యో రివర్‌ఫ్రంట్‌ల మాదిరిగా హైదరాబాద్ నైట్ ఎకానమీ పుంజుకునే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. డ్రై పోర్ట్, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, ORR–RRR మధ్య మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ వంటి కీలక మౌలిక వసతుల ప్రాజెక్టుల పురోగతిని కూడా ఆయన సమావేశంలో వివరించారు.
“చైనా+1 మోడల్‌కు ఉత్తమ ప్రత్యామ్నాయం తెలంగాణ అవుతుంది” అని సీఎం స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ‘తెలంగాణ రైజింగ్–2047’ విజన్‌పై టెక్ దిగ్గజాలు ప్రశంసలు కురిపించాయి.