ఉపకార వేతనాల ప్రక్రియ వేగవంతం చేయండి మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాలు
మన భారత్ , మెదక్, నవంబర్ 13: ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన షెడ్యూల్ కులాల ఫ్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల పునరుద్ధరణ (రెన్యూవల్) మరియు నూతన రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. గురువారం మెదక్ కలెక్టరేట్‌లోని అడిటోరియంలో వసతిగృహాల సంక్షేమాధికారులు, ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించి ఆయన కీలక సూచనలు చేశారు.
కలెక్టర్ మాట్లాడుతూ, “ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ అవి విద్యార్థులకు సమయానికి అందకపోవడం విచారకరం. పేద విద్యార్థుల చదువుకు ఉపకార వేతనాలు ప్రధాన అండగా నిలుస్తాయి. ఆర్థిక సమస్యలు లేకుంటే విద్యార్థులు చదువులో మెరుగైన ఫలితాలు సాధిస్తారు,” అని పేర్కొన్నారు.
అర్హులైన విద్యార్థులందరికీ ఉపకార వేతనాలు చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న రెన్యూవల్, నూతన రిజిస్ట్రేషన్, అలాగే బయోమెట్రిక్ ధృవీకరణ ప్రక్రియను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని సూచించారు.
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రిన్సిపాళ్లు హార్డ్‌కాపీలను సంబంధిత కార్యాలయాల్లో సమయానికి అందజేయాలని ఆయన తెలిపారు. విద్యార్థుల **కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ**లో తహసీల్దార్లు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఈ-పాస్ లాగిన్‌లో విద్యార్థుల బ్యాంకు వివరాల్లో తప్పులు ఉంటే వెంటనే సరిచేయాలి అని చెప్పారు.
విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సమయంలో అవసరమైన ధ్రువపత్రాలు సిద్ధంగా ఉండేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించండి. ఉపకార వేతనాల కోసం నిధుల కొరత లేదు,” అని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఎస్సీ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, గిరిజన సంక్షేమ అధికారి నీలిమ, జిల్లా విద్యాశాఖాధికారి విజయ, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, వసతిగృహాల సంక్షేమాధికారులు పాల్గొన్నారు.